
గంజాయి చాక్లెట్లు తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్
చౌటుప్పల్: గంజాయి చాక్లెట్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చౌటుప్పల్ బస్టాండ్‌లో ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రం చాప్రా జిల్లా బనియాపూర్ మండలం హర్పూర్‌కర్హా గ్రామానికి చెందిన సునీల్ రాయ్, బిట్టు కుమార్ టిప్పర్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వారిద్దరు తమ ఊర్లో గంజాయిని చాక్లెట్లు రూపంలో మార్చుకొని మూడు రోజుల క్రితం రైలులో బయల్దేరి ఆదివారం హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో విజయవాడకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారితో మరో వ్యక్తి రావాల్సి ఉన్నందున మార్గమధ్యలో ఆదివారం సాయంత్రం చౌటుప్పల్‌లో దిగారు. తమ వెంట తెచ్చుకున్న బ్యాగులతో బస్టాండ్‌లో తిరుగుతుండగా.. అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు అటుగా వచ్చారు. పోలీసులను చూసి వారిద్దరు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో పోలీసులు వారి వద్దకు వెళ్లి బ్యాగులను తనిఖీ చేయగా.. దుస్తుల నడుమ దాచి ఉంచిన 8 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు, సెల్‌ఫోన్ లభించాయి. వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.