
మంత్రి క్యాంపు కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నల్లగొండ టూటౌన్: నల్లగొండ పట్టణంలోని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్‌తో వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలంకలం సృష్టించింది. నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో ల్యాడర్ వాహణానికి ఔట్ సోర్సింగ్ కింద డ్రైవర్‌గా పనిచేసిన కరుణాకర్ శనివారం జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏడు నెలల కిత్రం అతన్ని విధుల నుంచి మున్సిపల్ అధికారులు తొలగించడంతో తన ఉపాధి పోయిందని మంత్రిని కలిసేందుకు వచ్చాడు. పెట్రోల్ బాటిల్‌తో రావడంతో దానిని చూసిన పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. అతని చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను లాక్కున్నారు. వెంటనే అతన్ని నల్లగొండ టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అప్పటికి క్యాంపు కార్యాలయానికి మంత్రి చేరుకోలేదు. నల్లగొండ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ముకిరాల కరుణాకర్ కొంతకాలం డ్రైవర్‌గా ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో పలుమార్లు మద్యం సేవించడం కారణంగా ల్యాడర్‌పైకి ఎక్కిన ఎలక్ట్రిషన్ కింద పడిపోయినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. వీధి దీపాలు, సెంట్రల్ పోల్స్‌కు లైట్లు బిగించడానికి ల్యాడర్ వాహనం ఉపయోగిస్తారు. ల్యాడర్ బకెట్‌లో నిలబడి స్తంభానికి లైట్లు మరమ్మతులు, కొత్తవి అమర్చడం లాంటివి చేస్తుంటారు. అయితే, ల్యాడర్ డ్రైవర్ మద్యం తాగి వచ్చిన కారణంగా ఏడు నెలల క్రితం విధుల నుంచి పూర్తిగా తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్‌అహ్మద్ తెలిపారు. కాగా, స్థానిక నాయకుల కారణంగానే తన భర్తను విధుల నుంచి తొలగించినట్లు బాధితుని భార్య ఆరోపించింది.