
ద్రవరూప ఎరువులతో రైతులకు ప్రయోజనం
నానో ఎరువులు మేలైనవి
ద్రవరూప యూరియా, డీఏపీల ఉపయోగంపై రైతులకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. గుళికల ఎరువు కంటే నానో ఎరువులు చాలా మేలైనవి. వరి నాటుకు ముందుగా ఒకసారి మాత్రమే నానో డీఏపీని పొలంలో పిచికారీ చేయాలి. అలాగే నానో యూరియాను లీటర్ నీటికి 2మి.లీ. లేదా 4మి.లీ. చొప్పున కలిపి మొదటగా పంట పెరుగుదల దశలో తర్వాత నెలలోపు పూత దశలో రెండోసారి పిచికారీ చేయాలి. దీంతో రైతులకు సుమారు 8 శాతం పంట దిగుబడి పెరుగుతుంది.
– పి.సందీప్‌కుమార్, ఏఓ, పెద్దవూర
పెద్దవూర: వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రైతులకు ఆర్థిక ఇబ్బందులను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎరువుల ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. గతంలో పంటలకు వేసే డీఏపీ, యూరియా గుళికల రూపంలో ఉండేది. ఒక్కోటి 50 కిలోల బస్తా మార్కెట్లో అందుబాటులో ఉండేది. ఏళ్ల తరబడి కొన్ని రకాలైన పంటలకు రసాయన ఎరువులను అధిక మోతాదులో వినియోగిస్తున్నారు. అధికంగా రసాయన ఎరువుల వాడకం మంచిది కాదని తెలిసినా గత్యంతరం లేక రైతులు వీటిని వినియోగిస్తున్నారు. రైతుల ఆరోగ్యానికి సైతం పెద్దముప్పుగా మారిందని భావించిన కేంద్ర ప్రభుత్వం ద్రవరూప యూరియా, డీఏపీలను తీసుకువచ్చింది. దీంతో భూమిలో సారం కోల్పోయి క్రమేణ పంట దిగుబడులు తగ్గుతున్నాయి. మూడేళ్ల క్రితమే నానో యూరియా మార్కెట్లోకి రాగా గత యేడాది నుంచి ద్రవ రూపంలో ఉండే డీఏపీ సైతం అందుబాటులోకి వచ్చింది. ఘనరూపంలో ఉండే 50 కిలోల డీఏపీ బస్తా రూ.1350లు, యూరియా బస్తా రూ.266లు ధర మార్కెట్‌లో ఉంది. కాగా ఇఫ్కో కంపెనీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన నానో డీఏపీ అర లీటరుకు రూ.600లు, యూరియా అరలీటర్‌కు రూ.240 ధరతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ద్రవరూప యూరియాపై రూ.26(266–240), డీఏపీపై రూ.750(1350–600) వరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
పోషక విలువలు పెరుగుదల
అధికారుల అంచనా ప్రకారం ద్రవరూప ఎరువులతో పంటకు ప్రయోజనం సుమారు 90శాతం ఉంటుందని తెలుపుతున్నారు. అరలీటరు నానో డీఏపీ, యూరియా డబ్బాలు 50 కిలోల బస్తాతో సమానం. ఎకరానికి అరలీటరు నానో డీఏపీ సరిపోతుంది. వరి నాటు వేసేటప్పుడు ఘనరూప డీఏపీ ఎంత విస్తీర్ణంలో వినియోగిస్తామో, అరలీటర్ ద్రవరూప డీఏపీ పొలంలో పిచికారీ చేస్తే సరిపోతుంది. ద్రవరూపంలో పిచికారీ చేయడం వలన అదనంగా పోషకాలు సైతం ఉండటంతో మొక్కలు నత్రజని అవసరాన్ని సమర్థవంతంగా తీరుస్తుంది. దీంతో ఆకులలో కిరణజన్య సంయోగక్రియ పెరుగుతుంది. మొక్క వేర్లలో కణజాలం వృద్దిచెంది, పంట ఉత్పత్తిలో పోషక విలువలు పెంచుతుంది. డీఏపీ, యూరియాల బస్తాలకంటే ద్రవరూప ఎరువుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఘనరూపంలో ఉండే ఎరువుల వినియోగంతో చాలా వరకు మొక్కకు అందకుండా వృథా అవుతుంది. ద్రవరూప ఎరువులు నేరుగా మొక్కపై పిచికారీ చేయడంతో వృథా ఉండదు.
ఫ ఎరువుల ఖర్చులను తగ్గించేందుకు
ద్రవరూప యూరియా తీసుకువచ్చిన కేంద్రం

ద్రవరూప ఎరువులతో రైతులకు ప్రయోజనం

ద్రవరూప ఎరువులతో రైతులకు ప్రయోజనం

ద్రవరూప ఎరువులతో రైతులకు ప్రయోజనం