
ఒంటరి మహిళలే టార్గెట్
నల్లగొండ: ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని వారి మెడలో బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. త్రిపురారం మండలం నీలాయిగూడెం గ్రామానికి చెందిన రావిరాల పవన్ లిఫ్ట్ టెక్నీషియన్‌గా చేస్తున్నాడు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో ఉంటున్నాడు. అతడి సోదరుడు రావిరాల రాజు డ్రైవర్‌గా చేస్తున్నాడు. అతను హైదరాబాద్‌లోని సంగీ టెంపుల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వీరిద్దరూ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఒంటరి మహిళలనే టార్గెట్ చేసుకుని బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్నారు. ఈ నెల 4న చండూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బాధితురాలు బుచ్చమ్మ మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన వ్యవసాయ భూమి నుంచి ఇంటికి వస్తుండగా నిందితులిద్దరూ ఆమె దగ్గరకు వెళ్లి ఇడికుడకు దారి ఎటు అని అడుగుతూ మాటల్లో పెట్టి బాధితురాలి మెడలో ఉన్న 3 తులాల పుస్తెలతాడు లాక్కుని పరారయ్యారు. ఈ విషయమై బాధితురాలు చండూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో చండూరు సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ వెంకన్న, కనగల్ ఎస్‌ఐ విష్ణుమూర్తి నాలుగు టీంగా ఏర్పడ్డారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉదయం 7.30కు తాస్కానిగూడెం శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వారిని పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వీరిద్దరూ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల బంగారు ఆభరణాలు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. గొల్లగూడెంలో, వాడపల్లి మండలం కల్లేపల్లి సమీపంలో, పెన్‌పహాడ్‌లోని అనాజిపురం లింగాల, దోసపాడు గ్రామాల సమీపంలో, వేములపల్లి మండలం బీరెల్లిగూడెం సమీపంలో, నకిరేకల్ మండలం చందుపట్లలో, మర్రూర్‌లో రావిరాల పవన్, రావిరాల రాజు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. వారి నుంచి 19.5 తులాల 8 బంగారు పుస్తెల తాళ్లు, 2 సెల్‌ఫోన్లు, దొంగతనం చేయడానికి ఉపయోగించిన నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించిన డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ కె. ఆదిరెడ్డి, చండూరు, కనగల్ ఎస్‌ఐలు వెంకన్న, విష్ణుమూర్తి, ఉపేంద్ర, కార్తీక్, అరుణ్, నగేష్‌ను ఎస్పీ అభినందించారు.
ఫ పుస్తెలతాడు చోరీ చేస్తున్న
ఇద్దరు అన్నదమ్ముల అరెస్టు
ఫ రూ.19 లక్షల విలువైన
బంగారు ఆభరణాలు స్వాధీనం
ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ
ఎస్పీ శరత్‌చంద్ర పవార్