
స్వర్ణగిరిలో తిరుప్పావడ సేవ
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వర స్వామికి గురువారం స్వామి తిరుప్పావడ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 450 కిలోల అన్నప్రసాదం, లడ్డు, వడ వంటి పిండి వంటలను స్వామివారికి నైవేధ్యంగా సమర్పించారు. అంతకుముందు ఉదయం స్వామివారికి సుప్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణం జరిపించారు. మధ్యాహ్నం 3వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, కర్పూర మంగళహారతులు సమర్పించారు. గురుపూర్ణిమ సందర్భంగా ఆలయంలో రామానుజచార్యులకు ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, భక్తులుపాల్గొన్నారు.