
ప్రపంచ పర్యాటక కేంద్రంగా బుద్ధవనం
నాగార్జునసాగర్: ప్రపంచ పర్యాటక కేంద్రంగా బుద్ధవనం అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో గురువారం ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, బాలీవుడ్ నటుడు గగన్‌మాలిక్, వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్ రవి బంకర్ తదితరులు హాజరై బుద్ధవనంలో బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఐపీఎస్ అధికారి చారుసిన్హా బహూకరించిన బోధి మొక్కను బుద్ధవనంలోని ధ్యాన మందిరంలో నాటారు. ఆ తర్వాత మహాస్తూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతిని వెలిగించి బౌద్ధ సంప్రదాయం ప్రకారం చాటింగ్(ప్రార్థన) చేశారు. అనంతరం మహాస్తూపంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జానారెడ్డి మాట్లాడుతూ.. సిద్దార్ధుడు గౌతమ బుద్ధుడిగా మారిన తర్వాత ఆషాడ పౌర్ణమి రోజున తన శిష్యులకు మొదటి ఉపన్యాసం ఇచ్చిన రోజును పురస్కరించుకొని ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడి గొప్పతనాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అనంతరంర ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ.. బుద్ధవనాన్ని నాగార్జునసాగర్‌లో ఏర్పాటు చేయడానికి జానారెడ్డి కృషే కారణమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బుద్ధవనాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. బాలీవుడ్ నటుడు గగన్‌మాలిక్ మాట్లాడుతూ.. బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రపంచ దేశాల్లోని బౌద్ధ కేంద్రాలతో బుద్ధవనాన్ని సమన్వయం చేయడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం వారు సాగర్ జలాశయం మధ్యలో ఉన్న చాకలిగట్టును, నాగార్జునకొండను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ అధికారి శాసన, ఎస్టేట్ అధికారి రవిచంద్ర, ఆర్ట్ మరియు ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్‌రావు, ఇంజనీర్లు శ్రీనివాస్‌రెడ్డి, నజీష్, దైవజ్ఞశర్శ, సాగర్ సీఐ శ్రీనునాయక్, హాలియా ఏఎంసీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్‌రెడ్డి, జిల్లా నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి