
సాగర్‌లో విద్యుదుత్పాదన ప్రారంభం
నాగార్జునసాగర్: ఎగువ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తుండడంతో గురువారం ప్రధాన విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో అధికారులు విద్యుదుత్పాదన ప్రారంభించారు. ఎగువ నుంచి వరద వస్తుండడంతో విద్యుత్ ఉత్పాదన నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ నీరంతా దిగువన టెయిల్‌పాండ్‌కు చేరుకుని.. అక్కడి నుంచి పులిచింతల ప్రాజెక్టుకు చేరుతుంది. గత ఏడాది కంటే ముందుగానే ఈ ఏడాది ముందుగానే అధికారులు విద్యుత్ ఉత్పాదనను ప్రారంభించారు.
విద్యుదుత్పాదన కేంద్రాలను
సందర్శించిన హైడల్ డైరెక్టర్
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లోని జల విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను టీజీ జెన్‌కో హైడల్ డైరెక్టర్ బాలరాజు గురువారం సందర్శించారు. ఎడమ కాల్వపై ఉన్న జల విద్యుత్ కేంద్రంలో శుక్రవారం నుంచి విద్యుత్ ఉత్పాదన ప్రారంభిస్తున్న నేపథ్యంలో రెండు టర్బైన్‌ల స్థితిగతులను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో రూ.7.5 కోట్లతో మరమ్మతులు జరుగుతున్న మొదటి టర్బైన్‌ను పరిశీలించారు. ఈ నెల 31వ తేదీ నాటికి మరమ్మతులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆయనకు జల విద్యుత్ కేంద్రం సీఈ మంగేష్‌నాయక్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
బైక్‌ను ఢీకొట్టిన లారీ..
ఒకరు మృతి
కేతేపల్లి: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండల పరిధిలోని చందుపట్ల గ్రామ పంచాయతీకి చెందిన జిల్లా వెంకన్న(46) సుతారి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురవారం పని నిమిత్తం బైక్‌పై కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్‌కు వచ్చిన వెంకన్న స్థానికంగా ఉన్న జంక్షన్ వద్ద హైవే దాటుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ బైక్‌తో పాటు వెంకన్నను దాదాపు వంద మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో వెంకన్న శరీరభాగాలు నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కేతేపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఎస్‌ఐ సతీష్ తెలిపారు.

సాగర్‌లో విద్యుదుత్పాదన ప్రారంభం