
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెన్‌పహాడ్: వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన దొంతగాని నాగయ్య(45) తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అనారోగ్య సమస్యలతో కిరాణ వ్యాపారి ఆత్మహత్య
మోత్కూరు: అనారోగ్య సమస్యలతో కిరాణ వ్యాపారి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు పట్టణంలోని కొత్త బస్టాండ్‌కు ఎదురుగా గల పద్మశ్రీ కిరాణ దుకాణం యజమాని దోర్నాల నర్సయ్య(54) గురువారం తెల్లవారుజామున తాను నివాసముంటున్న భవనం పైకి వెళ్లి రూములో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిరోజు వాకింగ్‌కు వెళ్లే నర్సయ్య భవనం పైకి వెళ్లి ఎంతసేపటికీ తిరిగి కిందకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఆయన ఉరికి వేలాడుతూ కనిపించాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్య సమస్యలతోనే నర్సయ్య ఆత్మహత్య చేసుకున్నాడని అతడి భార్య పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కల్తీ పాలు తయారుచేస్తున్న వ్యక్తిపై కేసు
భువనగిరి: కల్తీ పాలు తయారుచేస్తున్న వ్యక్తిపై భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. భువనగిరి మండలం మన్నెవారిపంపు గ్రామంలో ఓ వ్యక్తి కల్తీ పాలు తయారుచేసి హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి అతడి వద్ద 80లీటర్ల కల్తీ పాలు, ఐదు కిలోల మిల్క్ పౌడర్, 500 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాకై ్సడ్, 400 మిల్లీలీటర్ల ఎసిటిక్ యాసిడ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు భువనగిరి రూరల్ ఎస్‌హెచ్‌ఓ అనిల్‌కుమార్ తెలిపారు.