
వీవర్స్ సర్వీస్ సెంటర్‌కు జాతీయ అవార్డు
భూదాన్‌పోచంపల్లి: దక్షిణ భారతదేశ రీజియన్ పరిధిలో హైదరాబాద్‌లోని వీవర్స్ సర్వీస్ సెంటర్‌కు గురువారం కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ 2024–25 సంవత్సరానికి గాను స్కీమాటిక్ ఇంటర్‌వెన్షన్స్, ప్రొడక్ట్ అండ్ డిజైన్ డెవలప్‌మెంట్ జాతీయ అవార్డు ప్రకటించింది. ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అవార్డు అందజేయనున్నారు. ఈ సందర్భంగా హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ రీజినల్ హెడ్ ఆఫీసర్ ఎస్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 30 రకాల స్కీమ్‌లను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడంతో పాటు నూతన చేనేత డిజైన్ల అభివృద్ధికి కృషి చేసినందుకు దేశంలోనే ఉత్తమ వీవర్స్ సర్వీస్‌సెంటర్‌తో పాటు ఉత్తమ అధికారిగా అవార్డు వచ్చిందని తెలిపారు. తెలంగాణలో ఆధునిక టెక్నాలజీతో కూడిన 118 ఎలక్ట్రానిక్ జకాట్ మిషన్లు అందజేసి, నూతన డిజైన్లలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. వందశాతం సబ్సిడీతో 450 మగ్గాలు, 115 వర్క్‌షెడ్‌లు, 198 ఆసుమిషన్లు అందజేశామని పేర్కొన్నారు. 630 సమర్ధ్ శిక్షణ తరగతులను నిర్వహించామని చెప్పారు. అంతరించిపోతున్న గద్వాల్ ఒర్జినల్ చీరలతో పాటు కాకతీయుల కాలం నాటి ఆర్మూర్ చీరలను నేయిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ వీవర్స్ సర్వీస్‌సెంటర్ అందిస్తున్న సేవలను గుర్తించి దేశంలోనే హైదరాబాద్, చైన్నె వీవర్స్ సర్వీస్‌సెంటర్‌లు అవార్డుకు ఎంపికయ్యాయని తెలిపారు.