
9న మత్స్యగిరి క్షేత్రంలో వేలం పాటలు
వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వాయిదాపడిన వేలం పాటలను తిరిగి ఈనెల 9న నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మోహన్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూజల సామగ్రి, దుకాణాల నిర్వహణ కోసం జూన్ 5,18,28తేదీల్లో వేలం నిర్వహించగా వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డాయన్నారు. హైదరాబాద్‌లోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కార్యాలయంలో టెండర్,బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ వెల్లడించారు.
నేడు కలెక్టరేట్‌లో
దొడ్డి కొమురయ్య వర్ధంతి
భువనగిరిటౌన్ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు దొడ్డి కొమ్మురయ్య వర్ధంతిని శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హనుమంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. బీసీ, ఇతర కుల సంఘాల నాయకులు, అధికారులు పాల్గొనాలని కోరారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు కూడా కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలు, సువర్ణప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అదే విధంగా ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కైంకర్యాలు గావించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు.
కోర్టు భవనాల నిర్మాణానికి రూ.34.50 కోట్లు మంజూరు
రామన్నపేట : రామన్నపేట కోర్టు నూతన భవనాలు, రెసిడెన్సియల్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.34.50 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.29 కోట్లతో నాలుగు కోర్టులకు సంబంధించిన భవనాలు, రూ.5.50 కోట్లతో న్యాయమూర్తులు, సిబ్బంది ఉండటానికి నివాస గృహాలు నిర్మించనున్నారు. ఇటీవలే రామన్నపేటకు సివిల్‌జడ్జి కోర్టు మంజూరైంది. నూతన భవనాలు, క్వార్టర్స్ నిర్మాణానికి కొమ్మాయిగూడెం రోడ్డులో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కోర్టు భవన సముదాయం ఇరుకుగా ఉంది. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి కోర్టు భవనం శిథిల దశలో ఉండటంతో మరమ్మతులతో కాలం వెళ్లదీస్తున్నారు. నిధులు మంజూరు చేయడంతో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు ఎంఏ మజీద్ హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు.