
ధరల భారం!
ఇందిరమ్మ ఇళ్లకు
పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర ధరలు
సాక్షి,యాదాద్రి : పెరిగిన సిమెంట్, స్టీల్, ఇసుక ధరలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణదారులపై భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణాలు గాడిన పడుతున్న తరుణంలోనే సామగ్రి రేట్లు అధికం కావడం ప్రతిబంధకంగా మారింది. వీటికి తోడు కంకర, కూలి రేట్లు సైతం పెంచారు. పెరిగిన ధరలను బట్టి ఒక్కో ఇంటిపై రూ.3 నుంచి రూ.4లక్షల వరకు అదనపు భారం పడేలా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు.
రెండు విడతల్లో మంజూరైన ఇళ్లు..
తొలి విడతలో జిల్లాలోని 17 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద 761 ఇళ్లు మంజూరయ్యాయి. రెండో విడతలో నియోజకవర్గాల వారీగా 8,191 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో మొదటి, రెండో పేజ్ కలిపి సుమారు 4వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభుత్వం విడతల వారీగా లబ్ధిదారుకు రూ.5లక్షల సాయం అందజేస్తుంది.
మండుతున్న సిమెంట్..
ఇందిరమ్మ ఇంటికి 500 నుంచి 525 బస్తాల సిమెంట్ కావాలి. నెల రోజుల క్రితం బస్తా ధర రూ.280 ఉండగా ప్రస్తుతం గ్రేడ్‌ను బట్టి ఒక్కో బస్తాపై రూ.50నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. పాత ధర ప్రకారం రూ.1,47,000 సిమెంట్ ఖర్చు వచ్చేది. ప్రస్తుత రేటును బట్టి కట్టకు రూ.50 అదనంగా వేసుకున్నా రూ.1,73,250 అవుతుంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారుడిపై సిమెంట్ రూపేణా రూ.26,250 వరకు అదనపు భారం పడుతోంది. కట్టకు రూ.80 అయితే రూ.1,89,000 అవుతుంది.
ట్రాక్టర్ ఇసుక రూ.3,500కుపైనే..
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. కానీ, ట్రాక్టర్ల యజమానులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ట్రిప్పు ఇసుకకు రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రూ.4వేల వరకు తీసుకుంటున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముందు ట్రాక్టర్ ఇసుక ఏరియాను బట్టి రూ.1,500 నుంచి రూ.రెండు వేల వరకు సరఫరా చేసేవారు.
స్టీల్ ధరలకు రెక్కలు
స్టీల్ ధర కంపెనీని బట్టి గతంలో క్వింటా కనిష్టంగా రూ.5,500 ఉండగా ఇప్పుడు గరిష్టంగా రూ.7,800కు చేరింది. ఇంటి నిర్మాణానికి కనీసం 1.50 టన్నుల స్టీల్ పడుతుందని లబ్ధిదా రులు చెబుతున్నారు. రూ.5,500 చొప్పున రూ.82,500 అవుతుండగా.. సగటున క్వింటాకు రూ.7,500 చొప్పున రూ.1,12,500 ఖర్చవుతుంది. ఈ లెక్కన రూ.30,000 వరకు అదనపు భారం పడుతుంది.
రాయి, దొడ్డు కంకరకు రూ.1,800 పెంపు
బేస్మెంట్ నిర్మాణానికి రాయి తప్పనిసరి. గతంలో ట్రాక్టర్ రాయి, దొడ్డు కంకర రూ.3,200 ఉండగా ప్రస్తుతం రూ.3,500 నుంచి రూ.4,000 వరకు పలుకుతోంది. ఇక స్లాబ్‌లో ప్రత్యేకంగా సన్న కంకర వాడాల్సి ఉంటుంది. దాని ఖర్చు అదనం.
ఇకనుంచి తహసీల్దార్ల పర్యవేక్షణలో ఇసుక సరఫరా
ఇసుక సమస్యను అధిగమించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది.కొరత ఉన్న ప్రాంతాలకు ఇసుక నిల్వలున్న వాగులు, మూసీ నుంచి అవసరం మేరకు సరఫరా చేయాలని నిర్ణయించారు. తహసీల్దార్ పర్యవేక్షణలో ఇసుక సరఫరా జరుగుతుంది. అలాగే గోదావరి రీచ్‌లనుంచి ఇసుక తీసుకువచ్చి నిల్వ చేయడానికి డిపోలు ఏర్పాటు చేయనున్నారు.
ఇంటి నిర్మాణ సామగ్రి రేట్లు (రూ.ల్లో)
మెటీరియల్ గతంలో ప్రస్తుతం
సిమెంట్ (బస్తా) 280 330 - 360
స్టీల్ (క్వింటా) 5,500 6,000 - 7,800
ఇసుక (ట్రాక్టర్) 1500 3,500 - 4,000
రాయి (ట్రాక్టర్) 3,200 3,000 - 4,000
ఇసుక (ట్రాక్టర్) 1,500 3,500 - 4,000
కూలి (పురుషులు) 800 1,300
మహిళలకు 500 1,000
అడ్డా కూలీలకు ఫుల్ డిమాండ్
ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం రూ.5 లక్షలు
అదనంగా రూ.4 లక్షల వరకు ఖర్చు
ధరల నియంత్రణకు చర్యలు
తీసుకోవాలంటున్న లబ్ధిదారులు
అడ్డా కూలీలకూ ఫుల్ డిమాండ్
గతంలో అడ్డా కూలీకి పురుషులకు రోజుకు రూ.800 ఉండేది. ప్రస్తుతం రూ.1,300 అడుగుతున్నారు. మహిళలకు రూ.500 ఉండగా రూ.1000 డిమాండ్ చేస్తున్నారని, కూలి ఎక్కువ ఇచ్చినా కూలీలు దొరికే పరిస్థితి లేదని హమాలీలు చెబుతున్నారు.
నేల స్వభావాన్ని బట్టి నిర్మాణ వ్యయం
పెరిగిన సిమెంట్, స్టీల్, ఇసుక, రాయి, కంకర, కూలీల రేట్ల కారణంగా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలకు అదనంగా మరో రూ.4లక్షల వరకు ఖర్చు వస్తుందని లబ్ధిదారులు అంటున్నారు. నేల స్వభావాన్ని బట్టి కూడా నిర్మాణ వ్యయం పెరుగుతుంది. చౌడు నేలలో తప్పనిసరిగా పిల్లర్లు పోయాల్సి వస్తుండటంతో మరింత భారం పడుతుంది.