
యాదగిరి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: నిత్యపూజలు, భక్తుజనులతో ఆదివారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో కోలాహలం నెలకొంది. వేకువజామున స్వామి వారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, సహస్రనామార్చనలు చేశారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, స్వామి, అమ్మవారి నిత్యకల్యాణ వేడుక ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, సాయంత్రం ఆలయంలో వెండి జోడు సేవను ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయద్వారబంధనం చేశారు.