
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
చౌటుప్పల్ రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ సంచులను తయారు చేస్తున్న రమణీ ఇండస్ట్రీస్‌ను సోమవారం బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ సందర్శించారు. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు అందించిన సాంకేతిక సహకారంతో రమణి, డాక్టర్ ప్రసాద్‌లు నెలకొల్పిన రమణీ ఇండస్ట్రీస్‌లో బయో డిగ్రేడబుల్ సంచుల తయారీని పరిశీలించారు. ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బఝె డిగ్రేడబుల్ సంచులను ప్రపంచం అంతటికీ ఎగుమతి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక సేవా దృక్పథంతో బ్యాగులు తయారు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం టిప్ కార్యాలయానికి వెళ్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో చేపడుతున్న పరిశ్రమల వివరాలు తెలుసుకున్నారు. టిప్ మేనేజర్ శ్రీకాంత్.. పార్క్ అభివృద్ధిని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి వివరించారు. ఇండస్ట్రియల్ పార్క్ పక్కనే ఉన్న టెక్స్‌టైల్ పార్క్‌లో తయారవుతున్న వస్త్రాల తయారీ విధానాన్ని చూశారు. మిమీ క్రాఫ్ట్స్ హస్తకళల కేంద్రాన్ని పరిశీలించారు. మిమీ క్రాఫ్ట్స్ నిర్వాహకులు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారేత్ విన్ ఓవెన్ ను శాలువాతో సన్మానించారు.
బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్
గారెత్ విన్ ఓవెన్
దండుమల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లోని రమణీ ఇండస్ట్రీస్ సందర్శన