
అన్నదాతను వీడని అకాల వర్షం
అడ్డగూడూరు : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వర్షానికి కోటమర్తి, చిర్రగూడూరు, అడ్డగూడూరు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. కాంటా వేసిన వడ్లబస్తాలు తడిసిముద్దయ్యాయి. ఈదురుగాలులకు అడ్డగూడూరు మండల కేంద్రంలో రామనర్సయ్య, మొత్కు బ్రహ్మయ్యకు చెందిన ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. దీంతో ఇళ్లలోని సామగ్రి తడిసింది. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి.
నేటి నుంచి ఎంజీయూకు వేసవి సెలవులు
నల్లగొండ టూటౌన్: మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీ పరిధిలోని పీజీ, బీఈడీ, ఎంఈడీ కాలేజీలకు గురువారం నుంచి ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు యూనివర్సిటీ రిజిస్టార్ అల్వాల రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, డిగ్రీ కళాశాల యాజమాన్యాలు గమనించాలని కోరారు.