గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలోని విజయ పైపుల కంపెనీ సమీపంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దండుమల్కాపురం గ్రామ పరిధిలోని సంగం హోటల్ ప్రాంతంలో గుర్తుతెలియని యాచకుడు గత ఐదు రోజులుగా సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బుధవారం అదే వ్యక్తి విజయ కంపెనీ సమీపంలో మృతిచెందడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడు తెలుపు రంగు చొక్కా, లోపల ఎరుపు రంగు టీషర్ట్ ధరించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 55 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
నిందితులను వెంటనే
అరెస్టు చేయాలి
భువనగిరిటౌన్ : దళిత బహుజన పార్టీ భువనగిరి నియోజకవర్గ నాయకుడు, బీబీనగర్ మండలం వెంకిర్యాల వాసి బీరం సతీష్ ఇంటిపై మూకుమ్మడి దాడి చేసి గాయపర్చిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వీఎల్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం భువనగిరిలోని సతీష్ ఇంటికెళ్లి ఆయనను పరామర్శించారు. బీబీనగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, భువనగిరి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కార్యాలయాలకు బాధితుడితో కలిసి వెళ్లి నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వాకబు చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. ఈ కేసులో బీబీనగర్ సీఐ ప్రభాకర్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే త్వరలో డీజీపీ, ఎస్సీ ఎస్టీ కమిషన్‌ను కూడా ఆశ్రయిస్తామన్నారు. ఆయన వెంట బాధితుడు బీరం సతీష్ అతని కుటుంబ సభ్యులు, వెంకిర్యాల గ్రామ దళిత నాయకులు ఉన్నారు
ఆడబిడ్డ పుడితే
అదృష్టంగా భావించాలి
అనంతగిరి: ఆడబిడ్డ పుట్టిన ప్రతి కుటుంబం అదృష్టంగా భావించాలని తహసీల్దార్ కె. హిమబిందు అన్నారు. అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామంలో ఆడబిడ్డ పుడితే గ్రామానికి చెందిన కొందరు యువకులు ‘మన ఊరు మహాలక్ష్మి’ పేరుతో ఆ ఆడబిడ్డ పేరుపై పోస్టాఫీస్‌లో కొంత నగదు జమచేయడం అభినందనీయమని తహసీల్దార్ అన్నారు. బుధవారం గోండ్రియాల గ్రామానికి చెందిన గౌరా రాపు సునీత, కోటేశ్ దంపతుల కుమార్తె లోక్ష్య పేరుతో పోస్టాఫీస్‌లో రూ.18,464 నగదు జమ చేసి దానికి సంబంధించిన పాస్‌బుక్‌ను తహసీల్దార్ చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో మన ఊరు మహాలక్ష్మి వలంటీర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
వేములపల్లి ఎస్‌ఐపై
ఎస్పీకి ఫిర్యాదు
వేములపల్లి: పాత కక్షలు మనస్సులో పెట్టుకొని భీమనపల్లి గ్రామంలో తన 4గుంటల భూమిని కబ్జా చేయిస్తూ తనపై అక్రమ కేసులు బనాయిస్తున్న వేములపల్లి ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని బాధితుడు నామిరెడ్డి శ్రీధర్‌రెడ్డి బుధవారం నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా బాధితుడు శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. భీమనపల్లిలో సర్వే నం 29లో గల తనకు 16గుంటల భూమి ఉండగా బెదిరించి తన నాన్న సంతకాలను తీసుకొని కొంత భూమిని ఆక్రమించారని, ఇంకా 4గుంటల భూమి రెండు వైపులా రోడ్డు ఉండగా ఇటీవల ఎస్‌ఐ అండతో బొంత వెంకటయ్య, బొంత రాము, బొంత శ్రీకాంత్, కుంచం నాగయ్య, అభిమల్ల జానకిరాములు, అభిమల్ల అశోక్, గడ్డం మారయ్య, మర్రి సుదర్శన్, కొణతం కృష్ణయ్య, కొణతం రాంబాబు, కొండ్ర సాలయ్య తదితరులు తమ భూమిలో ఉన్న టేకు, సుబాబుల్ చెట్లను నరికించారని ఆరోపించారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ స్పందించకుండా ఆ భూమిలో రూమ్ ఏర్పాటు చేయండని సలహా ఇచ్చారని అన్నారు. తనను బెదిరించిన వారితో పాటు వారికి సహకరించిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు.


