బావిలో పడి మానసిక దివ్యాంగుడు మృతి
కట్టంగూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి మానసిక దివ్యాంగుడు మృతిచెందాడు. ఈ ఘటన కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం పరడ గ్రామానికి చెందిన కాసర్ల యాదమ్మ, నర్సిరెడ్డి దంపతుల ఏకై క కుమారుడు కాసర్ల శ్రీనివాసరెడ్డి(47) పుట్టుకతో మానసిక దివ్యాంగుడు. శ్రీనివాసరెడ్డికి 25 సంవత్సరాల క్రితం వివాహం చేయగా కుమార్తె జన్మించిన మూడు సంవత్సరాల అనంతరం భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి నర్సిరెడ్డి అనారోగ్యంతో మృతిచెందాడు. నాటి నుంచి యాదమ్మ తన మనువరాలు, కొడుకు ఆలనాపాలన చూసుకుంటుంది. ఈ నెల 2వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాసరెడ్డి తిరిగి రాలేదు. అతడి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా సోమవారం ఈదులూరు గ్రామ శివారులో గల బావిలో శ్రీనివాసరెడ్డి మృతదేహం తేలి ఉండటాన్ని బంధువులు గుర్తించారు. తన కొడుకు మానసికస్థితి సరిగా లేక ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు శ్రీనివాసరెడ్డి తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మునుగోటి రవీందర్ తెలిపారు.
ఉరేసుకుని బలవన్మరణం
చౌటుప్పల్: అనారోగ్యంతో బాధపడుతున్న యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గుండ్ల రామచంద్రయ్య–లక్ష్మమ్మ దంపతులకు ఒక మకుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరు పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె గుండ్ల మౌనిక(25) స్థానిక వలిగొండ రోడ్డు వద్ద ఉన్న అఖిల్ నేత్రాలయంలో రిసెప్షనిస్టుగా పనిచేసేది. ఇటీవల తనకు ఎర్ర రక్తకణాలు హెచ్చుతగ్గులు అవుతుండడంతో నాలుగు నెలలుగా ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో సన్నద్ధమవుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న మౌనిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రామచంద్రయ్య మధ్యాహ్నం ఇంటికి రాగా.. తలుపు పెట్టి ఉండడం, కుమార్తెను పలకకపోవడంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా.. మౌనిక ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.


