ఆర్థిక సమస్యలతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య
నాగార్జునసాగర్: ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైన ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్‌కాలనీలో జరిగింది. ఎస్‌ఐ సంపత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హిల్‌కాలనీకి చెందిన నెల్లం శ్రీనివాసరావు డిండి మండలంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్య, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య విజయశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఉపాధిహామీ కూలి పెంచాలి
కోదాడ: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఉపాధిహామీ కూలిరేట్లు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. ప్రసాద్ కోరారు. సోమవారం కోదాడ పట్టణంలోని సుందరయ్య భవన్‌లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు 11 శాతం పెరిగితే ఉపాధి కూలీల కూలి రేటు 2శాతం మాత్రమే పెంచడం అన్యాయమన్నారు. కూలిరేట్లను రోజుకు ఏడు రూపాయలు మాత్రమే పెంచడం పేదలను అవమానించడమే అని అన్నారు. భూమిలేని వ్యవసాయ కార్మికులకు రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల అవుతున్నా నేటికీ అమలు చేయలేదన్నారు. ఈ వర్క్‌షాప్‌లో సంఘం జిల్లా అధ్యక్షుడు ముల్కలపల్లి రాములు, యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, మిట్టగడుపుల ముత్యాలు, స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు.


