
మనోహర్ (ఫైల్)
భువనగిరి: ప్రమాదవశాత్తు బావిలో పడి విద్యార్థి మృతిచెందిన ఘటన భువనగిరి పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండలం పాముకుంట గ్రామానికి చెందిన దుపాసి మనోహర్(19) పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో మధ్యాహ్నం సమయంలో హాస్టల్‌లో ఉంటున్న ఐదుగురు విద్యార్థులతో కలిసి పట్టణంలోని తారాకరామనగర్ సమీపంలో ఉన్న బావిలో ఈతకు వెళ్లారు. ఇందులో ఇద్దరికి మాత్రమే ఈత రావడంతో వారు బావిలో ఈత పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. ఇదే సమయంలో మనోహర్ తన కాళ్లను కడుక్కోవడం కోసం బావిలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు జారి నీటిలో పడిపోయాడు. వెంటనే తోటి విద్యార్థులు గమనించి కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. వెంటనే విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.