అనుమతులు లేని కళాశాలలకు ప్రారంభోత్సవం
భీమవరం: విద్యకు పెద్ద పీట వేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేస్తున్నా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ కార్యాలయానికి సొంత గూడు, సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయానికే సొంతగూడు లేక పరాయి పంచన కాలక్షేపం చేస్తుంటే ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిర్వహణ ఎలా ఉంటుందో? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు రెండు ఎయిడెడ్, రెండు సోషల్ వెల్ఫేర్, సుమారు 82 ప్రైవేటు కళాశాలలున్నాయి. ఇవికాక ఈ ఏడాది మరికొన్ని జూనియర్ కళాశాలల ఏర్పాటుకు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఇంటర్మీడియట్ విద్య నిర్వహణకు జిల్లా కేంద్రమైన భీమవరంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయానికి సొంత భవనం లేక కొంతకాలంగా పట్టణంలోని గ్రంధి వెంకటేశ్వరరావు(జీవీఆర్) ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలోని చిన్న గదిలో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని విధులు నిర్వహిస్తున్నారు.
ఇద్దరితో నెట్టుకొస్తున్న వైనం
ఇంటర్మీడియట్ కార్యాలయంలో జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారితో (డీఐఈఓ)పాటు సూపరింటెండెంట్, యూడీసీ, ఎల్‌డీసీ, ఏవో, అటెండర్ వంటి సుమారు 15 మంది వరకు సిబ్బంది పని చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ సూపరింటెండెంట్, యూడీసీ, డిప్యూటేషన్‌పై అటెండర్ మాత్రమే పని చేస్తున్నారు. ఇటీవల సూపరింటెండెంట్, యూడీసీలకు పదోన్నతులు లభించడంతో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో ప్రస్తుతం డీఐఈఓ, అటెండర్‌తోనే కాలక్షేపం చేస్తున్నారు. దీంతో కొత్తగా కళాశాల ఏర్పాటుకు అనుమతులు, అడ్మిషన్స్, ఇంటర్ పరీక్షల నిర్వహణ వంటి వాటిని పర్యవేక్షించడం వారికి తలకుమించిన భారంగా మారింది.
సొంత భవనం లేక ఇబ్బందులు
గత కొంతకాలంగా భీమవరం పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వం జూనియర్ కళాశాలలోని చిన్నపాటి గదిలో కార్యాలయాన్ని నిర్వహిస్తున్న అధికారులు పరీక్షల నిర్వహణకు ఇబ్బందిగా ఉండడంతో క్యాంప్‌ను తాత్కాలికంగా పట్టణంలోని కేజీఆర్‌ఎల్ కళాశాల ఆవరణలోకి మార్చారు. ఈ నెల 6 నుంచి జూనియర్ కళాశాలలు నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో అనేక ప్రైవేట్ కళాశాలలో ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు వసూలు, కళాశాలల వద్దనే బుక్స్, విద్యాసామాగ్రి వంటివి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే డీఐఈఓ కార్యాలయానికి తగిన సిబ్బంది, అనుకూలమైన కార్యాలయం భవనం లేకపోవడం చూస్తుంటే వీరి పర్యవేక్షణ ఎలా ఉంటుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టరేట్‌లో సముదాయంలోనే జిల్లా విద్యాశాఖ కార్యాలయం నిర్వహిస్తుండగా డీఐఈఓ కార్యాలయం ఎవరికీ అంతగా అందుబాటులో లేని చోట నిర్వహించడం వెనుక ఆంతర్యం అంతుబట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అనుమతులు లేని విద్యాసంస్ధలకు ప్రజాప్రతినిధులే ప్రారంభోత్సవాలు చేయడం దీనికి నిదర్శనంగా ఉందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవేటు విద్యాసంస్ధలను నడుపుతున్న యాజమాన్యాలపై అధికారులు మెతకవైఖరే దీనికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని 20 మండలాల పరిధిలో అనేక ప్రైవేటు పాఠశాలలు, కళాశాలు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే నడుపుతున్నారు. ఒక్క భీమవరం పట్టణం, భీమవరం మండలాల్లోనే 48 ప్రైవేట్ పాఠశాలలకుగాను 25 పాఠశాలలకు ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఎలాంటి అనుమతులు లేవు. అలాగే ప్రస్తుత విద్యాసంవత్సరానికి జిల్లాలో 7 నూతన కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నట్లు విద్యాశాఖ చెబుతుంది. అయితే వీటికి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అనుమతులు రాకుండానే పెద్ద సంఖ్యలో విద్యార్థులను చేర్చుకుంటుండగా వారి వద్ద నుంచి ఫీజుల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న కళాశాలను పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవం చేయడం విశేషం.


