ఉండి: రొయ్యల సాగులో నీటి నాణ్యత, మేతల యాజమాన్యం అత్యంత ప్రాముఖ్యమైనవని ఎన్నార్పీ అగ్రహారం కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు అన్నారు. కేవీకేలో రొయ్యల పెంపకంపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఎంపెడా అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామ్ కే మెహతా పాల్గొని మాట్లాడారు. రొయ్యల ఎగుమతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, దేశీయ రొయ్యల మార్కెట్ అభివృద్ధి, సుస్థిర రొయ్యల పెంపకం వంటి వాటిపై రైతులకు అవగాహన ఉండాలన్నారు. కేవీకే హెడ్ మాట్లాడుతూ చెరువు తయారీలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోర్సు ఇన్‌చార్జి, మత్స్య శాస్త్రవేత్త ఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ రొయ్యల పెంపకంలో చెరువుల తయారీతో పాటు మట్టి పరీక్షలు జరగాలని అన్నారు. వానపాముల ఎరువు ఎకరాకు సుమారు 150 కి.వాడాలని సూచించారు. రొయ్యల పిల్ల చెరువులో వదిలే సమయంలో రెండు చిన్న ఆపాలు చెరువులో పెట్టుకుని వాటిలో ఒక్కొక్క దానిలో 100 పిల్లల చొప్పున వేసి రెండు రోజుల తరువాత లెక్కగట్టి బతుకుదల శాతం తెలుసుకొని యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో గాదిరాజు వెంకట సూర్యనారాయణరాజు, తాటిపట్టి భాను తదితర రైతులు పాల్గొని మాట్లాడారు.


