ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
● చిన భద్రాద్రిగా యర్రగుంటపల్లి రాముని గట్టు
● నవమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
● రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల రాక
చింతలపూడి : శ్రీరామ నవమి వేడుకలకు మండలంలోని యర్రగుంటపల్లి గ్రామ సమీపంలోని శ్రీ రామ రామలింగేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. ఇక్కడ ఈనెల 27న సీతారాముల కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ నిర్వహించే సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దీంతో భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
చిన భద్రాద్రిగా..
రాముడి గట్టుగా ప్రసిద్ధికెక్కిన శ్రీ సీతారామాంజనేయ ఆలయాన్ని ఈ ప్రాంత భక్తులు చిన్న భద్రాచలంగా పిలుచుకుంటారు. భద్రాద్రిలో వెలసిన విగ్రహాలను పోలి ఇక్కడి విగ్రహాలు ఉండటం విశేషం. అంతేగాకుండా భద్రాచలంలో సీతాదేవి రాముల వారి తొడపై ఆసీనురాలైనట్లు ఇక్కడ కూడా అదే విధంగా కూర్చుని ఉండటం జరిగింది. ఈ ఆలయాన్ని అతి ప్రాచీనమైనదిగా చెబుతుంటారు. వందల ఏళ్ల క్రితం శ్రీరామ చంద్రుడు సీతాలక్ష్మణ సహేతుడై శంఖు చక్రాలతో ఈ ప్రాంతంలో వెలిసినట్లు పూర్వీకులు చెబుతుంటారు. ఇక్కడ స్వామివారి కల్యాణం జరిపితే పెళ్లికాని అమ్మాయిలకు పెళ్లవుతుందని, సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేయడానికి శ్రీ రామ రామలింగేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారు.
శివాలయంలో రాములోరి కల్యాణం
సీతారామాంజనేయ ఆలయానికి చేరువలో కై లాసపతి పరమేశ్వరుడు నందీ సమేతంగా కొండ పైభాగంలో వేంచేసి ఉన్నాడు. పరమశివుణ్ని శ్రీరాముడు ముళ్ల గోరింట పూలతోను, బొంత పూలతోను పూజించినట్లు, వెలగ, నేరేడు పండ్లను నివేదించినట్లు చరిత్ర చెబుతోంది. ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమికి ఇక్కడ స్వామివారి కల్యాణాన్ని వైభవంగా జరుపుతారు. చుట్టుపక్కల గ్రామాలనుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని వీక్షిస్తారు. ఆలయ కమిటీతో పాటు, ఆదినుంచి సత్యన్నారాయణ శాస్త్రి కుటుంబీకులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని గ్రామస్తుల సహకారంతో జరుపుతున్నారు.
యర్రగుంటపల్లి రాముని గట్టు(ఆలయాన్ని) మరింత అభివృధ్ధి చేయడానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఆలయానికి చెందిన భూములను ట్రస్ట్‌కు అప్పగించి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. ఆలయం వద్దకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి.
– వి సత్యనారాయణ శాస్త్రి, ఆలయ కమిటీ అధ్యక్షుడు, యర్రగుంటపల్లి


