ఏలూరు (టూటౌన్): ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని, పెండింగ్ సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ధర్నా శిబిరాన్ని రాష్ట్ర కన్వీనర్ డా.గుగ్గులోతు కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల కనీస హక్కులైన 12వ పీఆర్సీ ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్ ప్రకటించడం అత్యవసరం అన్నారు. పెండింగ్ డీఏలు, 11వ పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్స్ వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయులపై యాప్‌ల భారం, బోధనేతర పనుల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సమస్యలు పరష్కరించని పక్షంలో ఏపీ జేఏసీ పక్షాన ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిసి సంయుక్త కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఈ రామ్మోహన్, గౌరవ అధ్యక్షుడు గంధం రాంబాబు, ప్రధాన కార్యదర్శి జి.మోహన్, టి.రామారావు, పి.నాగరాజు, టి.రాహుల్, ఎం.కృష్ణమూర్తి, జి.రమేష్, ఆర్‌డీవీ ప్రసాద్, కె.రఘురామరాజు, సుధీర్ కుమార్, రామదాసు, ఏ కృష్ణమూర్తి, జే శ్రీను, గుంటూరు శ్రీనివాసరావు ఎస్వీ దుర్గారావు, వెంకటరమణ, సౌజన్య ఎం.రమేష్‌బాబు, బి నాగరాజు, డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎం.హరికష్ణ, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ హాజరై మద్దతు తెలిపారు.


