భవన నిర్మాణం భారం | - | Sakshi
Sakshi News home page

భవన నిర్మాణం భారం

Mar 9 2026 7:21 AM | Updated on Mar 9 2026 7:21 AM

భవన నిర్మాణం భారం

ఇల్లు కట్టడం కష్టమే..

రోజుల వ్యవధిలోనే పెరుగుదల

మెటల్‌కు కృత్రిమ కొరత

భీమవరం(ప్రకాశం చౌక్‌): భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇల్లు కట్టుకునే సామాన్యులపై అ‘ధన’పు భారం పడుతోంది. నెల రోజుల వ్యవధిలో ఐరన్‌, సిమెంట్‌, కంకర ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం వేసవి సీజన్‌, వాతావారణం అనుకూలంగా ఉండటంతో ఎక్కువగా భవన నిర్మాణాలు చేపడతుంటారు. ఈ సమయంలో ధరల పెరుగుదలతో భవన యజమానులు సతమతమవుతున్నారు. నిర్మాణ దశలను అనుసరించి మెటీరియల్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో రోజురోజుకూ భారం పెరుగుతోంది.

నెల రోజుల్లో ఐ‘రన్‌’

భవన నిర్మాణంలో ప్రధానమైన ఐరన్‌ ధరలు నెలనెలా పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం టన్ను ఐరన్‌ రూ.60 వేలు ఉండగా ప్రస్తుతం రూ.10 వేలు పెరిగి రూ.70 వేలకు చేరింది. రెండు సెంట్లలో ఇంటి నిర్మాణానికి ఐరన్‌ 3 నుంచి 3.50 టన్నులు అవసరమవుతుంది. ఈ మేరకు ఐరన్‌పై రూ.40 వేల వరకు అదనపు భారం అవుతోంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇసుక ఇష్టానుసారం

జిల్లా గోదావరికి చెంతనే ఉన్నా సులభంగా ఇసుక లభించే పరిస్థితి లేదు. దీంతో ఇసుక ధరలు పెంచుతున్నారు. భవన నిర్మాణంలో ఎక్కువగా వినియోగించే సామగ్రి ఇసుక కావడంతో దీనికి డిమాండ్‌ ఉంటుంది. ఇదే అదనుగా ఇసుక ధరలను పెంచి విక్రయిస్తున్నారు. సాధారణంగా ఇంటి నిర్మాణంలో 6 యూనిట్ల పై నుంచి ఇసుక అవసరమవుతుంది. రెండు నెలల క్రితం గోదావరి తీరం నుంచి భీమవరానికి 6 యూనిట్ల ఇసుక ధర రూ.10 వేలు ఉంటే ప్రస్తుతం రూ.13 వేల నుంచి రూ.15 వరకు ఉంది. ముఖ్యంగా కిరాయిలకు ఇసుకు తీసుకువచ్చే వ్యాపారాలు ధర పెంచుతున్నారు. దీంతో ఇసుక కొనుగోలు సామాన్యులకు భారంగా మారింది.

అప్పులు చేసి నిర్మాణాలు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేశారు. అయితే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఇల్లు మంజూరు లేవు. దీంతో సొంతిల్లు లేని సామాన్యుడు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలంలో అప్పులు చేసి ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మెటీరియల్‌ ధరల పెరుగుదల భారంగా మారింది. ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణానికి ఎలాంటి సాయం అందకపోవడం, ధరల పెరుగుదలతో అప్పులు చేసి అక్కడక్కడా కొందరు నిర్మాణాలు చేపడుతున్నారు.

భీమవరంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు

ప్రభుత్వం గ్రామాలకు కొత్త ఇళ్లు మంజూరు చేయడం లేదు. భవన నిర్మాణం మెటీరియల్‌ ధరలు దారుణంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సొంతంగా సామాన్యులు ఇల్లు కట్టుకోవడం కష్టంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే యూనిట్‌ కాస్ట్‌ పెంచాలి. మెటీరియల్‌తో కలిపి రూ.3 లక్షల వరకూ సాయం అందించాలి.

– బి.రాంబాబు, కొండేపూడి

ఐరన్‌, సిమెంట్‌, కంకర తదితర మెటీరియల్‌ ధరలు రో జుల వ్యవధిలోనే పెరిగిపోతున్నాయి. నెల రోజుల్లో ఐరన్‌ టన్నుకు రూ.10 వేలు పెరిగింది. సిమెంట్‌, కంకరు ధరల పరిస్థితి అలాగే ఉంది. ఒకసారే మెటీరియల్‌ తెచ్చుకునే పరిస్థితి సామాన్యుల దగ్గర ఉండదు. దీంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

– సాంబా, తాపీమేస్త్రి, బంటుమిల్లి

ఇల్లు కట్టేదెలా!

భవన నిర్మాణ సామగ్రి ధరలకు రెక్కలు

టన్ను ఐరన్‌కు రూ.10 వేలు పెంపు

మెటల్‌, సిమెంట్‌ అదేబాటలో..

భవన యజమానులకు ఇక్కట్లు

గ్రామాల్లో ఇళ్లు మంజూరు చేయని కూటమి ప్రభుత్వం

మెటల్‌ (కంకర), సిమెంట్‌ ధరలకు కూడా రెక్కలు వచ్చా యి. కంకరు (త్రీఫోర్త్‌) మూడు యూనిట్లు ధర రూ.12 వేల నుంచి రూ.13,500కు చేరింది. మెటల్‌కు కృత్రిమ డిమాండ్‌ సృష్టించి ధరలు పెంచుతున్నట్టు సమాచారం. సిమెంట్‌ ధరలు కూడా బస్తాకు రూ.50 నుంచి రూ.100 వరకు పెరిగాయి. నిన్నమొన్నటి వరకూ బస్తా ఆయా గ్రేడ్లను బట్టి రూ.250 నుంచి రూ.300 వరకు ఉండగా ప్రస్తుతం రూ.300 నుంచి రూ.350 వరకు ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement