ఆకివీడు : శిథిలావస్థలో ఉన్న స్థానిక పెదపేటలోని పురాతన రామాలయం వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడకు డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు రాగా స్థానిక క్రైస్తవులు, సంఘ పెద్దలు ఇది సత్రం భూమి అని తమకు చెందినదేనని ఇక్కడ రామాలయం కట్టడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుందని అన్నారు. దీంతో నగర పంచాయతీ కమిషనర్ జి.కృష్ణమోహన్‌తో డిప్యూటీ స్పీకర్ మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడ విగ్రహాలున్నాయి, ఇది రామాలయం ప్రాంగణమే గుడి కడతామని చెప్పారు. గొడవలు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. గొడవలొస్తే చూసుకుందాంలే అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుండగా ఇరువర్గాల నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాల్ని చెదరగొట్టారు. రాత్రి దళిత సంఘాల నాయకులు పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. తమపై పోలీసులు దాడులు చేశారని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, రూరల్ సీఐ కాళీచరణ్ ఇక్కడకు వచ్చి దళిత నాయకులతో చర్చించారు.


