తణుకు అర్బన్: జీతాలు పెంచమని చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లిన అంగన్‌వాడీలను కూటమి ప్రభుత్వం అర్ధరాత్రి సమయంలో నిర్బంధించడం, అరెస్టులు, లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం నలుపు చీరలు, నలుపు రిబ్బన్లతో ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ మాట్లాడుతూ చంద్రబాబు మారలేదని, గతంలో గుర్రాలతో తొక్కించిన మైండ్ నేటికీ ఆయనకు కొనసాగుతుందని విమర్శించారు. ఒకవైపు 99 పైసలకు కార్పొరేట్లకు వేలాది ఎకరాలు ఇచ్చేటప్పుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లక్షలాది రూపాయలు గిఫ్ట్ కూపన్లు ఇస్తున్నపుడు, అంగన్‌వాడీలకు వేతనాలు పెంచమంటే డబ్బులు లేవని చెప్పి ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మండలం కన్వీనర్ గుబ్బల గోపి, ఐలు జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి, ప్రాజెక్ట్ అధ్యక్షులు బి.వసంత కుమారి, కోకన్వీనర్ ఎన్.ఆదినారాయణ బాబు, వి.ప్రమీల, డి.నళిని రాణి, జి.కనకదుర్గ, బి.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


