కొయ్యలగూడెం: నేవి ఆయుధ డిపో ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మంగపతిదేవిపేట, బోడిగూడెం, రేగులగుంట గ్రామపంచాయతీల రైతులు బర్కట్‌నగర్ వద్ద ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. సుమారు నెలరోజులుగా రైతులంతా ఆందోళన చేస్తున్నప్పటికీ ఆయుధడిపో నిర్మాణంపై ప్రభుత్వ అధికారులు పెదవి విప్పడం లేదని, కానీ ప్రజా ప్రతినిధులు మాత్రం పంతంతో అయినా సరే డిపో నిర్మిస్తామంటూ రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. ఇప్పటికే కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లామని కానీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం తమలో అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. రెవెన్యూ అధికారులకు కొందరు తొత్తులుగా వ్యవహరిస్తున్నట్లు రాత్రి వేళల్లో అధికారులను, దళారులు ఒకరికొకరు కలుసుకుని రహస్యమంతనాలు సాగిస్తున్నారని ఆరోపించారు. ఆయుధ డిపో నిర్మాణానికి రైతుల మధ్య చిచ్చుపెట్టే విధంగా కుయుక్తులు పన్నుతున్నారని కానీ తామంతా ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.


