ఆశ.. నిరాశ!
సమస్యల పరిష్కారం కోసం ఆశ వర్కర్లు గళమెత్తారు. ప్రభుత్వం చాలీచాలని జీతాలతో గొడ్డు చాకిరీ చేయించుకుంటోందని, కనీస వేతనం రూ.26 వేలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీతం రూ.10 వేలు రవాణా తదితర ఖర్చులకే సరిపోతుందని, కనీసం టీఏ, డీఏలు అయినా అందించాలని కోరుతున్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల 5న విజయవాడలో ధర్నాకు సన్నద్ధమవుతున్నారు.
ప్రధాన డిమాండ్లు
● కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలి.
● కార్మికులుగా గుర్తించి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి.
● ఖాళీ పోస్టులను తక్షణం భర్తీ చేయాలి.
● పనిభారం తగ్గించాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశ వర్కర్ల సంఖ్యను పెంచాలి.
● ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం శిక్షణ పొందిన ఆశలకు పర్మినెంట్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యమివ్వాలి.
● అవమానకరమైన పనుల నుంచి మినహాయింపు నివ్వాలి. అదనపు పనులను అప్పగించరాదు.
ఏలూరు (టూటౌన్): ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 3 వేల మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 1,750 మంది వ రకు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,250 మంది వ రకు ఉన్నారు. రోజురోజుకూ జనాభా పెరుగుతుండటంతో తమపై పనిభారం పెరుగుతోందని ఆశ వర్కర్లు గగ్గోలు పెడుతున్నారు.
ప్రజారోగ్య పరిరక్షణలో.. ఆశ కార్యకర్తలు నిత్యం ప్రజల సంరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా వీరు సేవలందిస్తున్నారు. సర్వే, ఇతర కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇంతలా సేవలందిస్తున్నా ప్రభుత్వం వీరికి రూ.10 వేలు మాత్రమే వేతనంగా అందిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే నిబంధనను ప్రభుత్వం పక్కన పెట్టేసింది.
అధికారుల దయాదాక్షిణ్యాలపైనే..
అత్యవసర పనుల నిమిత్తం సెలవు కావాలంటే అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆశ వర్కర్లు ఆవేదన చెందుతున్నారు 20 ఏళ్లుగా ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా పనిచేస్తున్న వారిని కార్మికులకు గుర్తించడం లేదని, దీంతో చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు కావడం లేదని చెబుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశ వర్కర్లను పెంచకుండా సుమారు 2 వేల నుంచి 5 వేల మంది జనాభాకు ఒక్కరే ఆశా వర్కర్‌తో చాకిరీ చేయిస్తున్నారని వాపోతున్నారు. ఆశ వర్కర్ల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
సంబంధం లేని పనులతో..
మాతాశిశు సంరక్షణ పేరుతో నియమించిన ఆశ వర్కర్లతో ప్రభుత్వం సంబంధం లేని పనులు చేయిస్తోంది. సర్వేల పేరుతో పనిభారం మోపింది. అలాగే పండుగలు, ఎన్నికలు, విపత్తుల వేళ కనీసం టీఏ, డీఏలు కూడా అందించడం లేదు. పీహెచ్‌సీ/యూపీహెచ్‌సీలు, వెల్‌నెస్ సెంటర్ల క్లీనింగ్, ఆయా కేంద్రాల పరిసరాలను పరిశుభ్రం చేయించడం, బాత్‌రూమ్ లు కడిగించడం వంటి పనులు కూడా చేయిస్తున్నారని ఆశ వర్కర్లు ఆవేద చెందుతున్నారు.
పోరుబాట
సమస్యలపై గళం
కనీస వేతనాల కోసం పోరాటం
ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి
5న విజయవాడలో ధర్నాకు పిలుపు
ఉమ్మడి జిల్లాలో 3 వేల మంది ఆశ వర్కర్లు


