పచ్చని పొలాల్లో నేవీ డిపో వద్దు
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలోని పచ్చటి పొలాల్లో నేవీ ఆయుధ క ర్మాగారం డిపో నిర్మించవద్దని, ఖాళీ ప్రదేశాల్లో నిర్మించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆయుధ కర్మాగారం నిర్మాణం చేపట్టే కొత్త చీమలవారిగూడెం, మడకంవారిగూడెం, దాట్లవారిగూడెం, వంకవారిగూడెం గ్రామాల్లో సో మవారం వామపక్షాల ఆధ్వర్యంలో నాయకుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా దాట్లవారిగూడెంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆయుధ కర్మాగారం నిర్మాణంలో ప్రభుత్వాలకు సొంత ప్రయోజనం తప్ప మరొకటి లేదని విమర్శించారు. ఆయా గ్రామాల్లో సుమారు 1100 ఎకరాల వరకు సాగు భూములు ఉన్నాయని, వాటిలో ఆయిల్‌పామ్, వేరుశనగ, వర్జీనియా పొ గాకు వంటి అన్ని రకాల పంటలూ రెండు సీజన్ లలో పుష్కలంగా పండుతున్నాయని చెప్పారు. అటువంటి గిరిజనుల భూములను లాక్కోవడం అంటే వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని చెప్పారు. ఆయుధ డిపో నిర్మాణం వల్ల ఆయా గ్రామాల గిరిజనులు కూలీలుగా మారతారని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యురాలు వనజ ఆవేదన వ్యక్తం చేశారు. డిపో నిర్మాణం నిలుపుదలకు గిరిజనులంతా సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. సీపీ ఎం నాయకుడు ఎ.రవి, సీపీఐ నాయకుడు కృష్ణ చైతన్య, సీపీఐఎంఎల్ నాయకులు ఎంఎస్ నాగరాజు, కారం రాఘవ తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
