
తుస్సుమన్న డీఏ హామీ
ఏలూరు, (మెట్రో): ఉద్యోగులకు నెల జీతంలో వంద పెరిగినా ఎంతో ఆనంద పడతారు. అలాంటిది ఉద్యోగికి రావాల్సిన రూ.కోట్లాది బకాయిల్లో కాస్త ఇస్తున్నామని ప్రకటిస్తే ఆ ఉద్యోగి ఆనందానికి అవధులు ఉండవు. కూటమి ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల జీవితాలతోనే ఆడుకుంటోంది. బతికుండగా ఇవ్వలేకపోతే ఉద్యోగులు మరణించాక వారికి బకాయిలు చెల్లిస్తామని చెబుతోంది. కనీసం పెన్షనర్లపైనా దయ చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలైంది. కనీసం ఉద్యోగుల ప్రయోజనాలపై ఒక్క మాట కూడా మాట్లాడిన పాపాన పోలేదు. ఇటీవల ఉద్యోగులు, పెన్షనర్లతో సమావేశంలో ఉద్యోగులకు ఒక డీఎ, పెన్షనర్లకు ఒక డీఆర్ ఇస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కాస్త ఊరట కలిగిందని భావించే లోపే ఉద్యోగులకు, పెన్షనర్లపై కూటమి సర్కారు పిడుగు వేసింది. ప్రకటించిన డీఎ, డీఆర్‌లను ఉద్యోగులు రిటైర్ అయిన తరువాత చెల్లిస్తామని లేకుంటే ఉద్యోగి మరణిస్తే వారి వారసులకు చెల్లిస్తామని, పెన్షనర్లకు 2027–28 సంవత్సరాల్లో 12 విడతల్లో చెల్లిస్తామని ప్రకటించింది.
ఇప్పటికే నాలుగు డీఏలు బకాయి : ప్రతి ఆరు నెలలకు డీఎ ప్రకటించి ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 67 వేలకు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారు. ఏలూరు జిల్లాలో 38 వేలు, పశ్చిమగోదావరి జిల్లాలో 29 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 వేలకు పైగా పెన్షనర్లు ఉన్నారు. వీరికి ఇప్పటికే 4 డీఎలు చెల్లించాల్సి ఉంది. 2024 జనవరి 1 నుంచి 2024 జూన్ 30 నాటికి ఒక డీఎ, 2024 జూలై 1 నుంచి 2024 డిసెంబరు 31 2వ డీఏ, 2025 జనవరి 1 నుంచి జూన్ 30 3వ డీఎ, 2025 జూలై 1 నుంచి 2025 డిసెంబరు 31వరకూ 4వ డీఎ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 2024 జనవరి 1 నుంచి 2025 సెప్టెంబరు 30 వరకూ 21 నెలల డీఎ 3.64 శాతాన్ని చెల్లిస్తామని గొప్పలు చెప్పిన కూటమి సర్కారు ఉద్యోగులు చనిపోవాలని, లేదంటే ఉద్యోగవిరమణ చేయాలని జీఓలు విడుదల చేసింది. వాస్తవానికి పెన్షనర్లకు డీఆర్ ప్రకటించిన వెంటనే వచ్చే నెల పెన్షన్‌తో బకాయిలు ఇవ్వాల్సి ఉండగా దీనికి విరుద్ధంగా 2027 తరువాత 12 విడతల్లో చెల్లిస్తానని చెప్పడం చూస్తుంటే బకాయిలు తీసుకోవాలంటే ఉద్యోగులు, పెన్షనర్లు చనిపోవాలా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కాగా ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం బకాయిలను 10 శాతం 2016 ఏప్రిల్‌లో, మిగతా 2026 ఆగస్టు, నవంబరు, 2027 ఫిబ్రవరిలో చెల్లిస్తామని మరో జీవో విడుదల చేసింది. దీనిపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
డీఎ బకాయిలు రావాలంటే ఉద్యోగి మరణించాలి.. లేదంటే రిటైరవ్వాలి
ఆ మేరకు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం
ప్రకటించిన ఒక్క డీఎ ఇప్పట్లో లేనట్టే
ఉమ్మడి జిల్లాలో 67 వేల మంది ఉద్యోగులకు మొండిచేయి
20 వేల మంది పెన్షనర్లదీ ఇదే పరిస్థితి