
27న ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
భీమవరం: ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరం నుంచి రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. అక్టోబర్ 27న తాడేపల్లిగూడెంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. అధికారులు సత్వరమే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. రైతు సేవా కేంద్రాలలో 50 శాతం గోనె సంచులు సిద్ధం చేయాలన్నారు. రైతులకు తప్ప దళారులకు ఎవరికై నా గోనె సంచులు ఇచ్చినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు అవసరమైతే వారి సొంత వాహనంలో ధాన్యాన్ని రైతు సేవా కేంద్రానికి తరలించుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు.