
అమర వీరుల కుటుంబాలకు భరోసా కల్పించాలి
భీమవరం: విధి నిర్వహణలో తమ ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. మంగళవారం భీమవరం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా సమాజ భద్రత, రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల ఆశయాలను స్మరించుకుంటూ ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, ఆర్మర్‌డ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎం.సత్యనా రాయణ తదితరులు అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి వీరమరణం పొందిన పోలీసుల గౌరవార్థం మౌనం పాటించారు. ఈ ఏడాది జిల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన డీఎస్పీ ఎం.చక్రధరరావు, ఎస్సై ఏజీఎస్ మూర్తి, పీసీలు సీహెచ్ వెంకటేశ్వరరావు, పి.శ్రీహరి, జి.సురేంద్రనాథ్, జేసీలు పి.సుధీర్ బాబు(గ్రేహౌండ్స్), కె.మనోజ్ కుమార్(గ్రేహౌండ్స్) కుటుంబ సభ్యులను సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడి, ఏపీఐఐసీ ఛైర్మనన్ మంతెన రామరాజు పాల్గొన్నారు.

అమర వీరుల కుటుంబాలకు భరోసా కల్పించాలి