
ఆహ్లాదం... విహారం
బుట్టాయగూడెం: కార్తీకమాసం ప్రారంభం కావడంతో పర్యాటకులు దైవ దర్శనాలతో పాటు పిక్నిక్‌లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పిక్నిక్ పేరుతో పర్యాటక ప్రాంతాలను చూసేందుకు సిద్దమవుతున్నారు. చలికాలం కూడా ప్రారంభం కావడంతో అందమైన పర్యాటక ప్రాంతాలు ఎక్కడున్నాయో అని ఆరా తీస్తున్నారు. జిల్లాలో అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలతోపాటు ఆధ్యాత్మిక దేవాలయాలవైపు ఒక లుక్కేద్దాం.
పశ్చిమ ఏజెన్సీలోని అటవీ అందాలు
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అడవి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. జాలువారుతున్న జలపాతాలు, కొండలను తాకుతున్న మేఘాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు మనసును దోచుకుంటున్నాయి. జల్లేరు జలాశయం, ముంజులూరులోని ఏనుగుతోగు జలపాతం, ఉప్పరిల్ల జలపాతం, గుబ్బల మంగమ్మ సన్నిధి, పోగొండ రిజర్వాయర్‌తో పాటు అటవీప్రాంతంలోని పలు ప్రదేశాలు పిక్‌నిక్ స్పాట్‌లుగా ఉన్నాయి. ప్రతి ఏటా కార్తీకమాసంలో లక్షలాది మంది పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో వనభోజనాలను ఏర్పాటు చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లో కూడా పిక్‌నిక్ సందడి ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా వర్షాలు విస్తరంగా కురుస్తున్నందున ప్రకృతి ఒడిలో విరాజిల్లే జలపాతలు వర్యాటకులు మనస్సును దోచుకుంటున్నాయి.
ఆహ్లాదకరం గోదావరి విహారం
కార్తీకమాసం వచ్చిందంటే పాపికొండల యాత్రకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. గోదావరి తీర ప్రాంతాలతో పాటు పాపికొండల విహారానికి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో రాష్ట్రంతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి యాత్రికుల తాకిడి అధికంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది అత్యధిక వర్షాలు కురిసి గోదావరి వరద కూడా ఉధృతంగా ప్రవహించడంతో బోటు ప్రయాణాలను పర్యాటక శాఖ నిలిపివేసింది. ప్రస్తుతం గోదావరి తగ్గుముఖం పట్టడంతో పర్యాటక శాఖ తిరిగి పాపికొండల విహార యాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఘాట్ నుంచి పాపికొండల విహారయాత్రకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
సందర్శన స్థలాలు
పాపికొండల విహారయాత్రలో భాగంగా పలు సందర్శనా స్థలాలను చూడవచ్చు. ఇసుక తిన్నెలపై కొలువైన పోలవరం మండలం పట్టిసీమ వీరభద్రస్వామి, మహానందీశ్వర స్వామి ఆలయాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మగుడి, బ్రిటిష్ కాలపు పోలీస్ స్టేషన్, 11వ శతాబ్దం నాటి ఉమాచోడేశ్వర స్వామి ఆలయం, కొరుటూరులో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కార్టేజీలు, పేరంటాలపల్లి ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ శివుడిని దర్శించుకోవచ్చు. అలాగే గోదావరి వెంబడి ఇరువైపులా గట్లపై దర్శనమిచ్చే గిరిజన గ్రామాల్లోని ఇళ్లు పర్యాటకులను కనువిందు చేస్తాయి. పోలవరం ప్రాజెక్టు కూడా పర్యాటకుల మనసును దోచుకుంటుంది. గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టును తిలకించేందుకు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఇది పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందుతోంది.
నేటి నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసం సందడి
విహారయాత్రలకు పశ్చిమ మన్యం సోయగాల ఆహ్వానం
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అందుబాటులోకి అనేక సౌకర్యాలు

ఆహ్లాదం... విహారం

ఆహ్లాదం... విహారం

ఆహ్లాదం... విహారం