
చెరువులో మునిగి రిటైర్డ్ ఉద్యోగి మృతి
భీమడోలు: భీమడోలు శివాలయం వద్ద చెరువులో ప్రమాదవశాత్తు జారి పడి రైల్వే రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ మృతి చెందాడు. భీమడోలు గ్రామానికి చెందిన బసవ ప్రభాకరరావు(74) రెండు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈ నెల 15న సంతమార్కెట్‌కు సైకిల్‌పై వెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అతని సైకిలు చెరువులో సమీపంలో దొరికింది. చెరువులో ప్రభాకరరావు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చలపతిరావు తెలిపారు.
ఆగిరిపల్లి: నేరం రుజువు కావడంతో ముద్దాయికి సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ నూజివీడు కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. కృష్ణా జిల్లా పామర్రు మండలం మల్లవరానికి చెందిన చుండూరు రమేష్ సగ్గూరులో బైక్ చోరీ చేశాడు. దీనిపై ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముద్దాయిని రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగిరిపల్లి ఎస్సై శుభ శేఖర్ దర్యాప్తు పూర్తి చేసి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. నేరం రుజువు కావడంతో రమేష్‌కు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి శ్రావణి తీర్పు వెల్లడించారు.
ఏలూరు (టూటౌన్): పీడీఎస్‌ఓ, ఎన్‌వైఎస్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం స్థానిక ఫైర్ స్టేషన్ నుంచి కొత్త బస్టాండ్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విద్య, ఉపాధి రంగాల సంక్షోభం, యువత ఆత్మహత్యలు అంశంపై జిల్లా సదస్సును స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. సదస్సులో కవి, రచయిత సుంకర గోపాల్ మాట్లాడారు. విద్యా విధానం అశాసీ్త్రయంగా ఉందని, మార్కులు, ర్యాంకులు, సర్టిఫికెట్లే లక్ష్యంగా సాగుతున్న చదువులు విద్యార్థుల ఆత్మహత్యలకు దోహదం చేస్తున్నాయని అన్నారు.