
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం
పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని వైఎస్సార్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని లంకలకోడేరులో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల పోస్టర్లను ఆవిష్కరించి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీనవర్గాలకు వైద్య విద్యను దూరం చేసి పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేసి లబ్ధి పొందాలనే దురుద్దేశంతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరంకుశత్వ పాలన కొనసాగిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణపై పోరాటం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా ఈ పోరాటంలో భాగం కావాలని కోరారు. సంతకాలు చేయడం ద్వారా నిరసన తెలపవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నడపన గోవిందరాజులు నాయుడు, చెల్లెం ఆనందప్రకాష్, యడ్ల తాతాజీ, పెన్మెత్స ఏసురాజు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.