
మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తయ్యేదెప్పుడు?
గిరిజనుల పట్ల చిత్తశుద్ధి లేదు
రూ.12 కోట్లతో ఆస్పత్రి పనులు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీప్రాంతంలోని ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుట్టాయగూడెం శివారు పద్మవారిగూడెం సమీపంలో సుమారు రూ. 50 కోట్లతో 146 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేశారు. గిరిజన ప్రాంత ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడే వైద్యసేవలు పొందాలనే లక్ష్యంతో 2020 అక్టోబర్ 2 న పనులు ప్రారంభించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఫేజ్–1లో ఆస్పత్రి భవనం, ఫేజ్–2లో స్టాఫ్ క్వార్టర్స్, ఫేజ్ పేషెంట్స్ అంటెండెన్స్ భవనాలు నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం మొదటి ఫేజ్ భవనం శ్లాబ్ వరకూ పూర్తయ్యింది. మిగిలిన రెండు ఫేజ్‌లలోని భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులకు సుమారు రూ.12 కోట్లు ఖర్చయినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల ముందు వరకూ పనులు జరిగినా తర్వాత అవి నిలిచిపోయాయి. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తిరిగి పనులు ప్రాంభించకపోవడంతో గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.
ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే..
ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే గిరిజన ప్రాంత ప్రజలు ఏలూరు, విజయవాడ, రాజమండ్రికి వైద్యం కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండదు. ఏజెన్సీ ప్రాంతంలోని ఐదు మండలాలతోపాటు జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లోని ప్రజలు కూడా ఇక్కడ వైద్యం పొందవచ్చు. ఈ ఆస్పత్రి పూర్తయితే జనరల్ ఐపీ వార్డ్‌లు 30, పీడియాట్రిక్స్ వార్డులు 20, ఎస్‌ఐసీయూ 10, ఆర్ధో వార్డులు 30, జనరల్ ఐపీ వార్డులు 9తోపాటు మొత్తం 146 పడకలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల వ్యాధులకు సంబంధించి అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉంటారు.
కన్నెత్తి చూడని కూటమి పాలకులు
గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పనులు నిలిచినా వాటిని తిరిగి ప్రారంభించడంలో కూటమి పాలకులు కనీసం పట్టించుకోవడంలేదని గిరిజనులు విమర్శిస్తున్నారు. 15 నెలలుగా ఆ ఆస్పత్రి నిర్మించే రహదారి వైపు ప్రయాణిస్తున్నా కనీసం అటు వైపు కన్నెత్తి చూడటంలేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి నిర్మాణం పనులు పూర్తయితే గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని, ప్రభుత్వం, అధికారులు ఇప్పటికై నా పనులు పూర్తి చేయాలని అధికారులు కోరుతున్నారు.
గిరిజన ప్రాంత ప్రజలకు అందని ద్రాక్షగా కార్పొరేట్ వైద్యం
ఆస్పత్రి పనులు పూర్తి చేయాలంటున్న ప్రజలు
వైఎస్సార్‌సీపీ పాలనలో రూ.12 కోట్లతో జరిగిన పనులు
పనులవైపు కన్నెత్తి చూడని కూటమి పాలకులు
కూటమి ప్రభుత్వానికి గిరిజనుల పట్ల చిత్తశుద్ధి లేదు. మా ప్రాంతంలో ఏటా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ విష జ్వరాలతో బాధపడుతుంటాం. అత్యవసర వైద్యం కోసం బయట ప్రాంతాలకు పరుగులు తీస్తాం. గిరిజనుల బాధలు తీర్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వివిధ దశల్లో ఉంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ పనులు పూర్తి చేయడంలో చిత్తశుద్ధి చూపించడంలేదు.
– బన్నే బుచ్చిరాజు, సర్పంచ్, నిమ్మలగూడెం, బుట్టాయగూడెం మండలం
గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో రూ.50 కోట్లతో బుట్టాయగూడెంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు రూ.12 కోట్లతో పనులు జరిగాయి. ఆస్పత్రి భవనం శ్లాబ్ వరకూ వచ్చింది. స్టాఫ్ క్వార్టర్స్ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఎన్నికలకు ముందు పనులు నిలిచాయి. కూటమి ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది.
– తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, దుద్దుకూరు, బుట్టాయగూడెం మండలం

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తయ్యేదెప్పుడు?

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తయ్యేదెప్పుడు?

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తయ్యేదెప్పుడు?