
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఏఎస్సై మృతి
జంగారెడ్డిగూడెం: దైవదర్శనానికి వచ్చి తిరిగి వెళుతూ రిటైర్డ్ ఏఎస్సై జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వంతెన వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఎస్సై షేక్ జబీర్, మృతుడి కుమారుడి వివరాలు ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏఎస్సై నార్లపాటి జగ్గారావు (60) మంగళవారం భార్య సరోజినితో ద్విచక్రవాహనంపై మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. దర్శనం అనంతరం స్వగ్రామానికి వెళుతుండగా, జల్లేరు వంతెన వద్ద వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. జగ్గారావు తీవ్రంగా గాయపడగా, భార్య సరోజినికి స్వల్ప గాయాలయ్యాయి. మరో ద్విచక్ర వాహనదారుడు పాల వెంకన్నబాబుకు గాయమైంది. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో తీవ్రంగా గాయపడిన జగ్గారావు మధ్యలో మృతిచెందారు. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.