
మంచినీళ్లు కూడా ఇవ్వలేదు
యలమంచిలి: కనకాయలంక గ్రామాన్ని వరదనీరు చుట్టుముట్టి నాలుగు రోజులవుతుంది. ఇంత వరకు ఒక్క నాయకుడు కూడా వచ్చి ఎలా ఉన్నారు అని అడిగిన పాపాన పోలేదు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. చంటి బిడ్డలు పాల కోసం అలమటిస్తున్నారు. ఇళ్ల చుట్టూ దోమలు ముసురుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కనకాయలంక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో శనివారం వైఎస్సార్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి పార్టీ పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో వరద వచ్చిన వెంటనే మంచి నీళ్లు, పాలు, పిల్లలకు బిస్కట్లు, బ్రెడ్, పశువులకు దాణా ఇచ్చే వారని మహిళలు చెప్పారు. దీనిపై గోపి స్పందిస్తూ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలన్నారు. వరద నీరు చుట్టుముట్టి నాలుగు రోజులైనా కనీసం మంచినీళ్లు సరఫరా చేసే సామర్థ్యం ప్రభుత్వానికి లేదా అని దుయ్యబట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో వరద వచ్చిన వెంటనే బాధితులను ఆదుకుంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల రామానాయుడు గోదావరిలో దిగి ఆకలి కేకలు అంటూ కంచాలు, గరిట డప్పు కొట్టారని, మరి ఇప్పుడు ప్రజల ఆకలి కేకలు మంత్రికి వినపడడం లేదా అని ఎద్దేవా చేశారు. పడవలు నడిపే సరంగులకు కూడా భోజనం పెట్టలేని దీన స్థితిలో ఈ మంచి ప్రభుత్వం ఉందని గోపి విమర్శించారు. దాణా లేక అలమటిస్తున్న పశువులకు దాణా ఇవ్వకపోతే సోమవారం ఉదయం వైఎస్సార్‌సీపీ తరఫున రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ ఉచ్చుల స్టాలిన్‌బాబు, వైస్ ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్ మద్దా శ్రీనివాసరావు నాయకులు వినుకొండ రవి, వలవల ప్రసాద్, పులి సుబ్రహ్మణ్యం, పులి కాశి విశ్వేశ్వర కేశవమూర్తి, గుడాల సురేష్, నెల్లి ఆనందరావు, చింద్రపు గణపతి ఉన్నారు.
కనకాయలంక వరద బాధితుల ఆవేదన