
యథేచ్ఛగా మట్టి దోపిడీ
భీమవరం అర్బన్: జిల్లా కేంద్రమైన భీమవరం మండలంలో మట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అనుమతులు లేకుండా చెరువుల మట్టిని తవ్వి తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తుండడంతో మట్టి వ్యాపారం మూడు లారీలు, ఆరు ట్రాక్టర్లుగా సాగుతోంది. మండలంలో పెదగరువు, బరువానిపేట, దొంగపిండి తదితర గ్రామాల్లో చెరువుల మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. చెరువులు తవ్వాలనే రైతుల వద్దకు మట్టి మాఫియా వాలిపోయి కొంత సొమ్ముకు మాట్లాడుకుని ఖాళీ స్థలం, ఇళ్లు పూడ్చుకునే వారికి మేము పూడ్చేస్తామంటూ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. దూరాన్ని బట్టి మట్టి ట్రాక్టర్లకు రూ.800 నుంచి 1500 వరకు, లారీలకు రూ.4 వేలు నుంచి 6 వేలు వరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. చెరువులో మట్టిని బయటకు తరలించాలంటే రెవెన్యూ, వ్యవసాయ, మత్స్యశాఖ, మైనింగ్, ఆర్‌అండ్‌బీ, తదితర శాఖలు అనుమతులు ఉండాలి. కానీ కింది స్థాయి అధికారుల చేతులు తడిపి నిబంధనలకు నీళ్లు వదలి మట్టి మాఫియా తమ వ్యాపారాన్ని జోరుగా సాగించేస్తున్నాయి. కాగా మట్టి పెళ్లలు రోడ్డుపై పడడంతో ద్విచక్రవాహనాలు జారిపోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సుమారు 80 టన్నుల బరువు మట్టితో రోడ్లపై లారీలు తిరుగుతుంటే రోడ్లు ధ్వంసం అవుతున్నాయని వాపోతున్నారు.
బరువానిపేటలో కోట్లలో మట్టి వ్యాపారం
బరువానిపేట సమీపంలోని సుమారు 18 ఎకరాల్లో గత 4 నెలలుగా భారీ లారీలపై మట్టి తోలకాలు జరుగుతున్నాయి. గతంలో ఇక్కడినుంచి తరలివెళ్తున్న లారీలను గొల్లవానితిప్ప వద్ద ఆర్డీవో అడ్డుకుని సీజ్ చేశారు. మళ్లీ ఎండలు కాయడంతో మట్టి లారీలు తిరుగుతున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా లారీలు తిప్పి మట్టి తరలించి కోట్లు కొల్లగొడుతున్నట్లు బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై భీమవరం తహసీల్దార్ రావి రాంబాబును వివరణ కోరగా గ్రామాల్లో చెరువుల తవ్వకం, మట్టి రవాణ వంటివి తమ దృష్టికి రాలేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

యథేచ్ఛగా మట్టి దోపిడీ

యథేచ్ఛగా మట్టి దోపిడీ