
సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం
ఏలూరు (మెట్రో): ఉద్యోగాలు ఉంచుతారా... పీకేస్తారా... ఉంచితే ఏ శాఖ కేటాయిస్తారు.. ఏ పనులు చేయమంటారు.. ఇవీ సచివాలయ ఉద్యోగుల మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ఒక జవాబు మాత్రమే దొరికింది. కేవలం ఉద్యోగాన్ని మాత్రం ఉంచుతారు అనే సమాధానంతో సచివాలయ ఉద్యోగులు కాస్త ధైర్యంగా ఉన్నా మిగిలిన విషయాల్లో మాత్రం ప్రభుత్వం ఒక వైపు.. ఆయా శాఖల ఉన్నతాధికారులు మరో వైపు ఇబ్బందులకు గురి చేస్తుండడంతో అల్లాడుతున్నారు.
ప్రతి గ్రామంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గత వైఎస్సార్ సీపీ సర్కారు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. నిరుద్యోగులను సైతం ఆదుకునే విధంగా ఒక్కో సచివాలయంలో 10 నుంచి 15 మందికి శాఖల వారీగా ఉద్యోగాలను కల్పించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగులను తొలగించేందుకు అనేక కుట్రలు పన్నింది. అవి పనిచేయక ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసేందుకు సిద్ధం అయ్యింది.
మొదటి అస్త్రంగా రేషనలైజేషన్ (క్రమబద్ధీకరణ)
ఉద్యోగులను ఇబ్బందులు పెట్టే కుట్రల్లో భాగంగా క్రమబద్ధీకరణ అనే విధానాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఉద్యోగులను సచివాలయాల నుంచి తొలగించి ఆయా శాఖలకు సర్దుబాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 517 సచివాలయాలు ఉండగా వాటిలో 187 సచివాలయాలను కూటమి సర్కారు ఈ క్రమబద్ధీకరణ పేరుతో రద్దు చేసింది. జనాభాకు సరిపడా సచివాలయాలను ఏర్పాటు చేశామని ఈ రద్దుకు కారణంగా చెప్పుకొస్తుంది.
రెండో అస్త్రంగా వేరే శాఖలకు సర్దుబాటు
జిల్లా వ్యాప్తంగా తొలగించిన 187 సచివాలయాల్లో ఉద్యోగులను పూర్తిగా తీసేస్తే వ్యతిరేకత వస్తుందని భావించిన కూటమి సర్కారు ఆ ఉద్యోగులను శాఖలకు సర్దుబాటు చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఉద్యోగులకు ఎస్, నో అనే ఆప్షన్‌లు చూపించి నో అని ఉన్న సచివాలయ సిబ్బందిని వారికి నచ్చిన శాఖకు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అసలు తాము చదివిన చదువు ఏమిటి, తాము జాయిన్ అయిన ఉద్యోగం ఏమిటి, ఇప్పుడు ఏ ఉద్యోగం చేయాలో తెలీక సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళనను ఎదుర్కొంటున్నారు.
శాఖల మధ్య సమన్వయ లోపం
ఇక ఉద్యోగులు తమ ఉద్యోగం కాపాడుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్న తరుణంలో ఉన్నతాధికారుల బంతాటతో ఎక్కడ తాము ఉద్యోగం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఉద్యోగాల ఏర్పాటు, బదిలీ ఉంటుందని చెప్పడంతో ఏలూరు జిల్లా అధికారులు విడిపోయిన పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులు చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.
ఉద్యోగుల బదిలీల్లో వసూళ్ల పర్వం
సచివాలయ ఉద్యోగుల బదిలీ అనేది ఉద్యోగికి తీవ్ర ఇబ్బందిగా మారితే అధికారులకు, ఆయా శాఖలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులకు మాత్రం కాసుల మూటగా మారాయి. బదిలీల పేరుతో సచివాలయ ఉద్యోగులకు కావాల్సిన ప్రాంతం కేటాయించేందుకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూళ్లు చేస్తున్నారు. ప్రాంతాలను బట్టి రేటు ఏర్పాటు చేసి ఆ సొమ్ములు ఇవ్వకుంటే దూరంగా నియమిస్తున్నారు.
పలుమార్లు కలెక్టర్ ఆగ్రహం
జిల్లాలో బదిలీల ప్రక్రియపై కలెక్టర్ వెట్రిసెల్వి ఉన్నతాధికారులను పిలిచి సమావేశాలు ఏర్పాటు చేసినా అధికారులు సమన్వయం చేసుకోకపోగా వారి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం చేయాలని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు. ఇదేమిటని ప్రశ్నించిన సచివాలయ ఉద్యోగులకు దూరంగా బదిలీ అనే బహుమతిని ఇస్తున్నారు. ఇలా సచివాలయ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కాపాడుకునే పనిలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
బదిలీల్లో ఉద్యోగులతో కూటమి ప్రభుత్వం ఆటలు
ఇదే అదనుగా తీసుకుంటున్న ఉన్నతాధికారులు
కొన్ని శాఖల్లో లంచాలు సైతం డిమాండ్
కలెక్టర్ చెప్పినా పట్టించుకోని వైనం
జిల్లా వ్యాప్తంగా సచివాలయాలు : 517
క్రమబద్ధీకరణ పేరుతో రద్దు చేసినవి : 187
సచివాలయ ఉద్యోగులు మొత్తం మంజూరు : 5,591
ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారు : 4,412
ఖాళీగా ఉన్న ఉద్యోగాలు : 1,179