
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
కామవరపుకోట: మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. కూటమి ప్రభుత్వ నాయకుల అండదండలతో పగలు రాత్రి తేడా లేకుండా చెరువులోని మట్టిని కొల్లగొడుతూ కాసులు సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. అధికారుల నుంచి ఏ విధమైన అనుమతులు లేకుండా గత కొన్ని రోజులుగా తడికలపూడి గ్రామ శివారులోని సుబ్బులు కుంట చెరువులో జేసీబీలతో మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. ట్రాక్టర్లకు, జేసీబీలకు సైతం నెంబర్ ప్లేట్లు తీసేసి ఈ మట్టి దందా కొనసాగించడం గమనార్హం. ట్రాక్టర్ ట్రక్కు మట్టి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు విక్రయించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ఈ వ్యవహారంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇరిగేషన్ అధికారులను వివరణ అడుగగా మట్టి తవ్వకాలకు అనుమతులు లేవని తెలిపారు. తహసీల్దార్‌కి ఈ విషయం తెలియజేయగా వారిపై చర్య తీసుకుంటామని తెలిపారు.
కొత్త చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు
తాడేపల్లిగూడెం రూరల్: కూటమి నాయకులకు మట్టి బంగారమాయె’ అన్నట్టుగా మారింది. ప్రధానంగా మండలంలోని మాధవరం గ్రామంలో రమారమీ 40 ఎకరాల విస్తీర్ణంలోని కొత్త చెరువులో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. రెండు జేసీబీలను ఏర్పాటు చేసి లారీల్లో సరిహద్దు నియోజకవర్గమైన నిడదవోలు మండలంలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలోని వాహనాల్లో మట్టి తరలిపోతుంది. లారీ మట్టి రూ.2500 చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో కూటమి నాయకులకు మూడు పువ్వులు ఆరుకాయలుగా వ్యాపారం సాగుతోంది. చెరువులో నీరు ఉన్నా రాజమార్గం ఏర్పాటు చేసుకుని మరీ లారీల్లో మట్టిని తరలించేయడం గమనార్హం. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడంపై వారికి తెలిసీ మిన్నకుంటున్నారా? లేదా ఆమ్యామ్యాల మత్తులో జోగుతున్నారా ? అనే దానిపై ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారికి ఫోన్ చేయగా స్పందించలేదు.

యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు