
పీఎం సూర్యఘర్‌పై విస్తృత ప్రచారం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారం అవసరమని ఈపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వనజ అన్నారు. బుధవారం స్థానిక విద్యుత్ భవన్‌లో పీఎం సూర్యఘర్ పథకంపై నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సోలార్ విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సాహించాలని సూచించారు. పీఎం సూర్యఘర్ పథకం అమలులో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడాన్ని ఆమె ప్రశంసించారు. లబ్ధిదారులకు ఆలస్యం లేకుండా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ పి.సాల్మన్ రాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టెక్నికల్ పి.రాధాకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆపరేషన్స్ కేఎం అంబేద్కర్, పలువురు ఈఈలు, ఏఈఈలు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సోలార్ వెండర్లు పాల్గొన్నారు.
మోటార్‌సైకిళ్ల చోరీపై కేసు నమోదు
మండవల్లి: రెండు మోటార్‌సైకిళ్ల చోరీపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గుడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామానికి చెందిన దివి కార్తీక్ జూన్ 23న మండవల్లి ఇండియన్ బ్యాంక్ ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి అతని బైక్ కన్పించలేదు. దీంతో మండవల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదపారుపూడి గ్రామానికి చెందిన కొప్పురావూరి శాంతికుమార్ జూన్ 26న సాయంత్రం లోకుమూడి సెంటర్‌లో మోటార్ సైకిల్ పార్కు చేసి జ్యూస్ పాయింట్‌కి వెళ్లి తిరిగి వచ్చి చూడగా అతని బైక్ కన్పించలేదు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.