
శ్రీవారి దేవస్థానంలో తనిఖీలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు అందుతున్న వసతులు, సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రసాదాల నాణ్యతలను రాష్ట్ర దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్, ఎస్‌ఓపీ నోడల్ అధికారిణి భ్రమరాంబ బుధవారం తనిఖీ చేశారు. ముందుగా ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. అనంతరం భ్రమరాంబ ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి, ఇతర అధికారులతో కలిసి పారిశుధ్యం, క్యూ లైన్ల నిర్వహణ, దర్శనం ఏర్పాట్లు, డార్మేటరీలో వసతులు, భక్తులు సంచరించే ప్రదేశాల్లో ఉన్న సౌకర్యాలు తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు శుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత ప్రసాదాల తయారీ విభాగం, అన్నప్రసాద భవనం, ఉచిత అన్న ప్రసాద వితరణను పరి శీలించారు. భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదం, లడ్డూ, పులిహోర, శర్కర పొంగలి, ఉచిత ప్రసాదాల రుచి, నాణ్యతను పరిశీలించి భక్తుల అభిప్రాయాలను సేకరించి సంతృప్తి వ్యక్తం చేశారు.