
తగ్గిన ఉచిత విద్య అడ్మిషన్లు
భీమవరం: ప్రైవేటు స్కూళ్లలో పేదలకు ఉచిత విద్యనందించే పథకానికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో అడ్మిషన్లు తగ్గిపోయాయి. గత రెండేళ్లుగా జిల్లాలోని ప్రవేటు స్కూళ్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.2 కోట్ల నిధులు విడుదల చేయకపోవడంతో ఫీజు మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులే చెల్లించాలని స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి చేయడంతో పేదలు ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్స్ పొందడానికి వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో దాదాపు 1,500 మంది ఉచిత విద్యకు దరఖాస్తు చేసుకోగా వివిధ ప్రవేటు స్కూళ్లకు దాదాపు 1,261 మందిని అలాట్ చేశారు. కేవలం 809 మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించాలనే కల నెలవేర్చడానికి ప్రతి ప్రైవేటు స్కూల్లో ఒకటో తరగతిలో విద్యార్థుల సంఖ్యను బట్టి 25 శాతం సీట్లు పేదలకు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఐదేళ్లు నిండినవారికి రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు పట్టణ ప్రాంతాల్లో ఒక్కొక్క విద్యార్థికి రూ.7,500, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 6,500 ప్రభుత్వం ఆయా పాఠశాలలకు నిధులు జమచేస్తుంది.
జిల్లాలో 700 ప్రైవేటు స్కూళ్లు
జిల్లాలోని 20 మండలాల పరిధిలో సుమారు 700 ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 2022–23లో 1,162 మంది, 2023–24లో 1,176 మంది, 2024–25లో 1,787 మంది విద్యార్థులు చేరారు. వీరికి దాదాపు ప్రభుత్వం సుమారు రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులు చెల్లించకపోవడంతో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచే ఫీజులు వసూలు చేశాయి. ఇలాంటి తరుణంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు స్కూళ్లలో చేరడానికి దాదాపు 1,500 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 809 మంది మాత్రమే చేరారు. పాత బకాయిలను చెల్లించకపోవడంతో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు కొత్తగా విద్యార్థులను చేర్చుకునేందుకు నిరాకరించాయి. వారితో ప్రభుత్వం చర్చలు జరిపి పాత బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చినా దానిపై కదలికలేదు. దీంతో ఉచిత విద్య పొందడానికి వెళ్లిన విద్యార్ధుల తల్లిదండ్రులకు ప్రభుత్వం సొమ్ములు చెల్లించకపోతే మీరే చెల్లించాలంటూ ఖరాఖండిగా చెప్పడంతో అంత పెద్దమొత్తంలో సొమ్ము చెల్లించలేక అనేక మంది వెనుదిరిగినట్లు తెలిసింది.