
ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఆషాఢం ఆఫర్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీ ఏసీ బస్సుల ప్రయాణికులకు ఆషాఢం ఆఫర్ అందిస్తున్నట్టు ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ఆర్టీసీ డిపోల నుంచి బయలుదేరే అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు వెళ్లేటప్పుడు 10 శాతం, తిరిగి వచ్చేటప్పుడు 10 శాతం ప్రయాణ చార్జీల్లో రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయాలన్నారు.
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
భీమడోలు: గుండుగొలనులో ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సిరికోటి నర్మద అలియాస్ మౌనిక (20) ఈనెల 13వ తేదీ ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చే సరికి ఆమె విగత జీవిగా పడి ఉంది. ప్రేమ వ్యవహారమే యువతి మృతికి కారణమని అనుమానిస్తున్నారు. నర్మద అమ్మమ్మ కురమా మాణిక్యం ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫిట్స్‌తో కాలువలో పడి..
భీమవరం: ఫిట్స్‌తో ప్రమాదవశాత్తు కాలువపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై కె రామారావు మంగళవారం చెప్పారు. పట్టణంలోని సత్యవతి నగర్‌కు చెందిన గుమ్మాడి రామచంద్రరావు(32) ఈనెల 13వ తేదీన ఫిట్స్‌తో కాలువలో పడిపోయాడు. అతడిని బంధువులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. రామచంద్రరావు తల్లి రత్నకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామారావు చెప్పారు.
తణుకులో బుల్లెట్ చోరీ
తణుకు అర్బన్: తణుకులో బుల్లెట్ వాహనం చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక మునిసిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న మహమ్మద్ ఆలీషా తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన బుల్లెట్ సోమవారం రాత్రి అపహరణకు గురైందని తెలిపారు. బుల్లెట్‌ను ఇద్దరు యువకులు వేసుకుని వెళ్తున్నట్లుగా సమీపంలోని సీసీ పుటేజీ ద్వారా గుర్తించినట్లు చెప్పారు. బుల్లెట్ చోరీపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆలీషా తెలిపారు.
‘మన మిత్ర’ యాప్ ద్వారా నీటితీరువా పన్నుల చెల్లింపు
ఏలూరు (మెట్రో): జిల్లాలో నీటితీరువా పన్నులను ‘మన మిత్ర’ యాప్ ద్వారా చెల్లించవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ‘మన మిత్ర’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నీటితీరువా పన్నులను చెల్లించాలన్నారు. ఏదైనా సమస్యలు ఎదురైతే 95523 00009 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఆషాఢం ఆఫర్