
వేసవిని మించి.. ఠారెత్తిస్తున్న ఎండలు
ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు
పెంటపాడు: రోజురోజుకు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వర్షాకాలంలో వేసవిని మించి ఇలా ఎండలు మండిపోతుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎండ వేడిమి, ఉక్కపోత తట్టుకులేక అల్లాడుతున్నారు. ఈ విచిత్ర వాతావరణాన్ని తట్టుకోలేక అనేకమంది వ్యాధుల బారిన పడుతున్నారు. ఎండల వల్ల ప్రజలు బయటకు రాకపోవడంతో వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. కార్మికులు, స్కూలుకు వెళ్లే చిన్నారులు ఎండ దెబ్బకు అల్లాడుతున్నారు. కాగా ఖరీస్ సాగు పనులు ఇప్పటికే ప్రారంభం కాగా వర్షాలు లేకపోవడం, ఎండ వేడికి నాట్లు దెబ్బతినే అవకాశం ఉండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
వేళాపాళా లేని విద్యుత్ కోతలు
అప్రకటిత విద్యుత్ కోతలతో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలు అల్లాడుతున్నారు. సమయం, సందర్భం లేకుండా లైన్ క్లియరెన్స్, జంగిల్ క్లియరెన్స్, మెయింట్‌నెన్స్ వర్కులు అంటూ రోజూ ఏదో ప్రాంతంలో కోతలు విధిస్తున్నారు. రాత్రి సమయాల్లో అయితే ఇక చెప్పనక్కరలేదు. దీంతో కరెంటు లేక, ఉక్కపోత తట్టుకోలేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమలు బెడద కూడా ఎక్కువగానే ఉంది. పెంటపాడు, గూడెం ప్రాంతాల్లో ప్రతిరోజూ 10 గ్రామాల చొప్పున విద్యుత్ కోత ఉంటోంది. ఈ సమస్య ఎప్పటికీ తీరుతుందో తెలియడం లేదని ప్రజలు వాపోతున్నారు.