
దళితులపై దాడులను అరికట్టాలని వినతి
భీమవరం: రాష్ట్రంలో ఇటీవల దళితులపై దాడులు పెరిగిపోయాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ది బుదిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కోనా జోసెఫ్ కోరారు. మంగళవారం భీమవరం వచ్చిన జాతీయ షెడ్యుల్డ్ కులాల కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్, కమిషన్ డైరెక్టర్ జి.సునీల్ కుమార్‌బాబులను ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, వర్గీకరణతో కొందరు మాల, మాదిగలు రెండుగా విడిపోయి ఘర్షణలకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భీమవరంలో స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ముందుగా బీఆర్ అంబేడ్కర్ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఈది రవికుమార్, కేసి రాజు, గంటా సుందరకుమార్, బి కమలాకర్, టి ప్రశాంత్, పి ముసలయ్య, వి రత్నారాజు తదితరులు పాల్గొన్నారు.