
నిలకడగా వశిష్ట గోదావరి
పెనుగొండ: వశిష్ట గోదావరి నిలకడగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన వరద సోమవారం స్థిరంగా ఉంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం రాత్రి నుంచి గోదావరి వరద తగ్గుముఖం పట్టిందని, ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. లంక గ్రామాల్లోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై బురద చేయడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నరసాపురంలో పెరుగుతూ..
నరసాపురం: నరసాపురం వశిష్ట గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా నీరు నదిలోకి వచ్చి చేరుతుండగా నీటిమట్టం పెరుగుతోంది. నీరంతా సముద్రంలోకి వెళుతుందని ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. సముద్రం పోటు సమయంలో మాత్రం నీటిమట్టం కాస్త పెరుగుతోంది. నరసాపురంలో ఏటిగట్టును ఆనుకుని ఉన్న పొన్నపల్లి, మాధవాయిపాలెం ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజులపాటు నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది.
ఆఫ్‌లైన్ అడ్మిషన్లకు వినతి
భీమవరం: డిగ్రీ అడ్మిషన్లను ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించాలని, ఇంటర్న్‌షిప్ భారాన్ని తగ్గించాంలంటూ సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భీమవరంలో జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బి.గణేష్ మాట్లాడుతూ సాధారణ డిగ్రీ విద్యలో మార్పులు విద్యార్థులను గందరగోళంలోకి నెట్టుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అడ్మిషన్లలో సింగల్ మేజర్ విధానం ఇప్పటికే విఫలమైందని, ఈ విధానాన్ని కొనసాగించడం భావ్యం కాదన్నారు. డిగ్రీ విద్యలో డబుల్ మేజర్ విధానాన్ని అమలుచేయాలని కోరారు. డిగ్రీ ప్రవేశాలు ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల చాలా సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయని అన్నారు. జిల్లా కమిటీ సభ్యులు బి.సింధు, ఎం.భాగ్యలక్ష్మి, పి.సాయికృష్ణ పాల్గొన్నారు.
కేసుల్లో మధ్యవర్తిత్వంపై అవగాహన
భీమవరం: కోర్టు కేసుల్లో మధ్యవర్తిత్వంపై ప్రజలకు, కక్షిదారులకు అవగాహన కల్పించడానికి సోమవారం భీమవరంలో 1కే వాక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ వద్ద గల కోర్టు కాంప్లెక్స్ వరకు మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భీమవరం 3వ అ దనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కోర్టుల్లో ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కక్షిదారులు సహృద్భావ వాతావరణంలో మధ్యవర్తిత్వం ద్వారా రాజీపడితే సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. కేసుల రాజీకి ప్రత్యేకంగా శిక్షణ పొందిన న్యాయవాదులను నియమించామని వారి సేవలు వినియోగించుకోవచ్చునన్నారు. ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.సురేష్ బాబు, 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి, బెంచ్ మేజిస్ట్రేట్ నాగరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాన్, భీమవరం డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య, డీఎన్నార్ లా కళాశాల ప్రిన్సిపల్ రఘురాం, న్యాయవాదు లు, పారా లీగల వలంటీర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
23న ఉద్యోగ మేళా
భీమవరం (ప్రకాశంచౌక్): నరసాపురం వైఎన్ కళాశాలలో ఈనెల 23న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ (ఉద్యోగ దిక్సూచీ) నిర్వహించనున్నట్ట జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఉద్యోగ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. సుమారు 15 కంపెనీల్లో 700కు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. వివరాలకు సెల్ 94508 38388, 95020 24765 నంబర్లలో సంప్రదించాలని కోరారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

నిలకడగా వశిష్ట గోదావరి

నిలకడగా వశిష్ట గోదావరి

నిలకడగా వశిష్ట గోదావరి