
ఉధృతంగానే గోదావరి
ముంపులో కనకాయలంక కాజ్‌వే
యలమంచిలి: యలమంచిలి మండలంలో గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో కనకాయలంక కాజ్‌వే ఆదివారం నీట మునిగింది. దీంతో కనకాయలంక ప్రజలు అడుగున్నర లోతు వరదనీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. వరదనీరు ఇంకా పెరిగితే పెరిగితే పడవలు ఏర్పాటు చేస్తామని వీఆర్వో ఘనలక్ష్మీ తెలిపారు. అయితే భద్రాచలం వద్ద వరద ఆదివారం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సోమవారం ఉదయం వరకు కాజ్‌వేపై వరదనీటి ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. వరద ఉధృతిలో ఉన్న కనకాయలంక కాజ్‌వేను నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, తహసీల్దార్ గ్రంధి నాగ వెంకట పవన్‌కుమార్‌లు పరిశీలించి, స్థానిక అధికారులకు సహాయ చర్యలపై సూచనలిచ్చారు.
వేలేరుపాడు మండలం ఎద్దెలవాగు వంతెన వద్ద నాటు పడవపై ప్రయాణిస్తున్న గిరిజనులు
వేలేరుపాడు/ పోలవరం రూరల్/ పెనుగొండ/యలమంచిలి : భద్రాచలం వద్ద గోదావరి శాంతించినా దిగువన వరద పోటు కొనసాగుతోంది. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో ఎద్దెలవాగు వంతెన ఇంకా నీటమునిగే ఉంది. దీంతో వేలేరుపాడు మండలంలో 18 గిరిజన గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఆదివారం ఉదయం భద్రాచలం వద్ద 33.50 అడుగులు ఉన్న నీటిమట్టం రాత్రి 8 గంటలకు 30.20 అడుగులకు తగ్గింది. అయినా వేలేరుపాడు మండలంలో దిగువనున్న కొయిదా, కాచారం, టేకుపల్లి, పేరంటపల్లి, కట్కూరు, ఎడవల్లి, చిట్టంరెడ్డిపాలెం, ఎర్రతోగు, బుర్రెడ్డిగూడెం, సిద్ధారం, కుంకుడు కొయ్యలపాకలు, మరో ఏడు గిరిజన గ్రామాలు జలదిగ్బంధనంలో ఉన్నాయి. దీంతో అధికారులు ఎద్దెలవాగు వంతెన వద్ద నాటు పడవ ఏర్పాటు చేశారు.
భద్రాచలం వద్ద 30.20 అడుగులకు
పోలవరం మండలంలో గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద ఆదివారం రాత్రికి స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 7.19 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద కూడా నీటిమట్టం 30.20 అడుగులకు చేరుకుంది. క్రమేపీ వరద ప్రవాహం తగ్గుతోంది. ఆదివారం ఉదయానికి స్పిల్‌వే నుంచి 7.63 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తుండగా.. రాత్రికి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు తగ్గుతుండటంతో వరద ఉధృతి తగ్గింది. భద్రాచలం వద్ద 36.60 అడుగులకు చేరిన నీటిమట్టం క్రమేపీ తగ్గుతూ ఆదివారం రాత్రికి 30.20 అడుగులకు చేరింది.
సిద్ధాంతంలో ఉధృతంగా..
పెనుగొండ మండలంలో గోదావరికి వరద ఉధృతి మరింత పెరిగింది. దీంతో ఏటిగట్టు పొడవున లంక భూములను తాకుతూ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. సిద్ధాంతం మధ్యస్థ లంకకు నీటి మట్టం చేరుకోవడంతో పడవల రాకపోకలపై నియంత్రణ విధించారు. గోదావరిలో వెళ్లవద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సిద్ధాంతంలో పడవలను ఒడ్డుకు చేర్చారు. కేదారీఘాటలోని పుష్కర రేవులో ప్రతిష్టించిన లింగం గోదావరి వరద నీటిలో మునిగింది. ఘాట్‌లో మూడు పుష్కర రేవుల్లోకి వరద నీరు ఉధృతంగా రావడంతో పై మెట్ల వరకూ నీటి మట్టం చేరుకుంది. ఆచంట మండలంలో కోడేరులో పుష్కర ఘాట్ వరకూ వరద నీరు చేరింది. మరింత ఉధృతి వస్తే తప్ప ఆచంట మండలంలోని లంక గ్రామాలకు ఎలాంటి ముప్పులేదని అధికారులు తెలిపారు. మరింత ఉధృతి పెరిగితే సురక్షిత ప్రాంతాలకు ప్రజలు చేరుకోవాలని సూచించారు.
భద్రాచలం వద్ద శాంతించినా ఉమ్మడి జిల్లాలో తగ్గని వరద పోటు
పోలవరం ప్రాజెక్టు నుంచి 7.19 లక్షల క్యూసెక్కులు విడుదల
సిద్ధాంతం ఒడ్డున పడవల రాకపోకలు నిలిపివేత
ముంపులో కనకాయలంక కాజ్‌వే

ఉధృతంగానే గోదావరి

ఉధృతంగానే గోదావరి

ఉధృతంగానే గోదావరి