
బూటకపు హామీలతో మోసగించారు
తణుకు అర్బన్: ఎన్నికల ముందు బూటకపు హామీలిచ్చి ఇంటింటికీ మేనిఫెస్టో బాండ్లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకు మండలం మండపాక గ్రామంలో ఆదివారం నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో చంద్రబాబు వెన్నుపోటు, మోసం చేయడంలో నిష్ణాతుడని తెలిసినప్పటికీ మరోసారి నమ్మి మోసపోయామని ప్రజానీకం ఆవేదన చెందుతున్నార ని అన్నారు. ఏ గుమ్మంలోకి వెళ్లినా గతంలో వలంటీర్లు ఇంటిగడపలోకి వచ్చి పనులు చేసేవారని, రేషన్ ఇంటి గుమ్మంలోకి వచ్చేదని నేడు కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు చేయడంలేదని చెబుతున్నారని, ప్రజల కష్టాలు వర్ణనాతీతమని స్పష్టం చేశారు. హామీలు అమలుచేయరా అని నిలదీస్తుంటే దాడులు, హత్యలు, విధ్వంసానికి దిగుతున్నారన్నారు. శ్రీకాళహస్తిలో జనసేన ఇన్‌చార్జ్ డ్రైవర్‌ను చిత్రహింసలకు గురిచేసి హత్యచేశారని, గుడివాడలో జెడ్పీ చైర్‌పర్సన్‌పై టీడీపీ గూండాలు దాడికి దిగి సభ్యసమాజం తలదించుకునేలా దౌర్జన్యానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేశారని ఏరోజు ఏ ప్రాంతంలో ఏ దాడులు జరుగుతాయో, ఏ మారణకాండ సృష్టిస్తారోనని ప్రజలు భయాందోళనలో బతుకుతున్నారని మండిపడ్డారు. పరిపాలన అంతా దాచుకో దోచుకో అనే రీతిలో ఇస్టానుసారంగా దోచేసుకుంటున్నారని, తాడేపల్లి కేంద్రంగా కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరతీసి ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తుందని అన్నారు. కల్తీ మద్యం విక్రయాలు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతుందన్నారు. అనంతరం మండపాక గ్రామంలో ఇంటింటికి తిరిగి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కరపత్రాలను అందచేశారు. ఏఎంసీ మాజీ చైర్‌పర్సన్, తణుకు మండల మహిళాధ్యక్షురాలు ఉండవల్లి జానకి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ రుద్రా ధనరాజు, తణుకు మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు జంగం ఆనంద్‌కుమార్, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, నాయకులు ముళ్లపూడి బాబూరావు, బద్దే ప్రవీణ్, జువ్వల వెంకట్రావు, ఉండవల్లి సుందరరావు, ఉండవల్లి సురేష్, మరిశెట్టి రామకృష్ణ, మద్దల రవికాంత్, పమ్మి విజయశేఖర్, సరెళ్ల క్రాంతి, పాలపర్తి అఖిల్, మొంటెయి విజయరాజు తదితరులు పాల్గొన్నారు.