
చోరీ ఫోన్ల రికవరీలో జాప్యం
● జిల్లాలో మొత్తం 4,990 ఫిర్యాదులు
● వేరే రాష్ట్రాల్లో వాడుతున్న ఫోన్లను ట్రాక్ చేయడంలో భాషతో ఇబ్బంది
భీమవరం : మీ ఫోన్ పొగొట్టుకున్నారా? అయితే మీ ఫోన్‌కు సంబంధించిన వివరాలు పంపితే చాలు పోగొట్టుకున్న మీ మొబైల్‌ను రికవరీ చేసి మీకు అందిస్తామని పోలీసు శాఖ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఖరీదైన ఫోన్‌లు పొగొట్టుకున్న బాధితులు ఎంతో ఆశతో సెల్ ట్రాకింగ్‌కు ఫిర్యాదు చేస్తున్నా.. మీ ఫోన్ రికవరీ చేయలేకపోతున్నామని పోలీసులు చెబుతున్నారు. అందుకు ప్రధాన కారణం భాష ఇబ్బంది. ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అపహరణకు గురైన ఫోన్ ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్నట్లు ఫోన్ సిగ్నల్స్ ద్వారా పోలీసులు గుర్తించినా.. అక్కడి పోలీసులతో మాట్లాడడానికి భాష ఇబ్బందిగా మారింది. దీంతో ఎక్కువ ఫోన్లను రికవరీ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. సెల్ ట్రాకింగ్ సిస్టమ్‌లో ఇతర భాషలపై అనుభవం ఉన్న సిబ్బంది లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఇతర భాషలు తెలిసిన పోలీసు సిబ్బందిని నియమిస్తే ఎక్కువ ఫోనన్లు రికవరీ చేసే అవకాశముంటుందని పోలీసులు చెబుతున్నారు.
జిల్లాలో 4,990 ఫిర్యాదులు
జిల్లాలోని ప్రధాన బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, కూడళ్ల వద్ద నిత్యం సెల్‌ఫోన్ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో సెల్‌ఫోన్లు అపహరణకు గురవుతున్నా పోలీసులకు ఫిర్యాదు చేసేది కొద్దిమంది మాత్రమే. ఫిర్యాదు చేయాల్సి వస్తే.. ఫోన్ కొనుగోలు చేసిన రసీదులు చూపించడం, ఎక్కువ సార్లు పోలీసు స్టేషన్ చుట్టూ తిరగాల్సి రావడంతో ఫోన్ పోయినా మిన్నకుండి పోతున్నారు. ఖరీదైన ఫోన్లు, కొత్త ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు మాత్రం తన ఫోన్ కోసం ఫిర్యాదు చేస్తున్నారు.
రికవరీ చేసింది 1,612 మాత్రమే
జిల్లా వ్యాప్తంగా సెల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పది విడతల్లో సుమారు రూ.2.40 కోట్ల విలువైన 1,612 సెల్‌ఫోన్లు మాత్రమే రికవరీ చేయగలిగారు. ఫిర్యాదు అందిన సెల్ ఫోన్లు వాడుతూ ఉంటే అవి ఎక్కడ వినియోగిస్తున్నారో సెల్ ట్రాకింగ్ ద్వారా గుర్తించి ఆయా ప్రాంతాల్లోని పోలీసుల సహకారంతో వాటిని రికవరీ చేస్తుంటారు. పట్టుబడ్డ ఫోన్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వినియోగిస్తున్న వాటిని పోలీసులు రికవరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది సెల్ ఫోన్లు దొంగించే ముఠా సభ్యులు ఇక్కడ దొంగిలించిన ఫోన్‌లు కేరళ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. అక్కడ వాటిని కొంతమంది నేరుగా విక్రయిస్తుండగా మరికొంతమంది సెల్ ఫోన్ల విడిభాగాలుగా విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.